పెద్దపల్లి, జులై 05
మాజీ మంత్రి కేటీఆర్ కన్నెపల్లి పంపు హౌస్ పర్యటన నేపథ్యంలో పెద్దపల్లి జిల్లాలో రాజకీయ ఉద్రిక్తతలు నెలకొన్నాయి. పర్యటనను అడ్డుకునే ప్రయత్నాలను నిరసిస్తూ బీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేయగా, పోలీసులు ముందు జాగ్రత్త చర్యగా పలువురు నాయకులను, కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు.
మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కన్నెపల్లి పంపు హౌస్ పర్యటన రాజకీయ ఉద్రిక్తతకు దారితీసింది. కేటీఆర్ పర్యటనను కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డుకోవడానికి ప్రయత్నిస్తోందని బీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో, పెద్దపల్లి జిల్లాలోని మంథని, రామగిరి, కమాన్‌పూర్ మండలాల్లో పోలీసులు ముందు జాగ్రత్తగా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. జయశంకర్ భూపాల్పల్లి జిల్లా మహాదేవపూర్ మండలంలోని కన్నెపల్లి పంప్ హౌస్‌ను కేటీఆర్ సందర్శించనున్న నేపథ్యంలో, బీఆర్ఎస్ శ్రేణులను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు.
మంథని నుండి మహాదేవపూర్ వైపు వెళ్లే వాహనాలను పోలీసులు అపి తనిఖీలు చేపట్టారు. మంథని, రామగిరి, కమాన్‌పూర్ తదితర మండలాల నుంచి సుమారు 20 మంది బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
ప్రభుత్వ తీరును నిరసిస్తూ మంథని మండల బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ముందస్తు అరెస్టులు ప్రజాస్వామ్యానికి విరుద్ధమని బీఆర్ఎస్ నేత ఏ. గోలపు శంకర్ గౌడ్ విమర్శించారు.












