జిల్లా కేంద్రంతో పాటు మండల కేంద్రాల్లో పనిచేస్తున్న జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ (టిడబ్ల్యూజేఎఫ్) జిల్లా అధ్యక్షుడు పుప్పాల దేవిదాస్ డిమాండ్ చేశారు. సోమవారం టిడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రాను కలిసి వినతి పత్రం అందించిన సందర్భంగా ఆయన మాట్లాడారు.
కాంగ్రెస్ ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమానికి పాటుపడతానని హామీ ఇచ్చి, ఇప్పటికీ ఇళ్ల స్థలాలు ఇవ్వకపోవడం సరికాదని ఆయన అన్నారు. చాలీచాలని వేతనాలతో జర్నలిస్టులు పనిచేస్తున్నారని, వారిని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. అర్హులైన పేద జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చి, ఇల్లు మంజూరు చేయించాలని కోరారు.
అదేవిధంగా అర్హులైన వారందరికీ అక్రిడేషన్ కార్డులు, హెల్త్ కార్డులు తక్షణమే మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. లేనిపక్షంలో జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో దశలవారీగా ఆందోళన పోరాటాలను ఉదృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో టిడబ్ల్యూజేఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి జావిద్ తో పాటు పలువురు పాల్గొన్నారు.











