ఖానాపూర్, 2026-08-16
అంతర్జాతీయ ఉత్తమ విద్యా విధానాలు, బోధనా పద్ధతులు, విద్యార్థుల అభ్యసన విధానాలపై అధ్యయనం చేసేందుకు తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జపాన్ విద్యా పర్యటనకు రాష్ట్రం నుంచి 29 మంది ఉపాధ్యాయులను ఎంపిక చేశారు. ఈ ప్రతిష్ఠాత్మక పర్యటనకు నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం మాస్కాపూర్ పిఎం శ్రీ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు జాడి శ్రీనివాస్ ఎంపికయ్యారు.
అంతర్జాతీయ ఉత్తమ విద్యా విధానాలు, బోధనా పద్ధతులు, విద్యార్థుల అభ్యసన విధానాలపై అధ్యయనం చేసేందుకు తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జపాన్ విద్యా పర్యటనకు రాష్ట్రం నుంచి 29 మంది ఉపాధ్యాయులను ఎంపిక చేశారు. ఈ ప్రతిష్ఠాత్మక పర్యటనకు నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం మాస్కాపూర్ పిఎం శ్రీ ఉన్నత పాఠశాల స్కూల్ అసిస్టెంట్ (గణితం), ప్రధానోపాధ్యాయుడు జాడి శ్రీనివాస్ ఎంపికయ్యారు. ఆయన ఎంపిక పట్ల పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, గ్రామస్థులు హర్షం వ్యక్తం చేసి అభినందనలు తెలిపారు.
విద్యా ప్రగతికి నిరంతర కృషి
జాడి శ్రీనివాస్ 2018 నుంచి మాస్కాపూర్ పాఠశాలలో విద్యార్థుల విద్యా ప్రగతికి విశేషంగా కృషి చేస్తున్నారు. జాతీయ ఆదాయ సహ ప్రతిభా ఉపకార వేతన పరీక్షకు మార్గదర్శకత్వం, పదో తరగతి ప్రత్యేక తరగతులు, విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ, పాఠశాలలో ప్రవేశాల పెంపు వంటి కార్యక్రమాలను నిరంతరం నిర్వహిస్తున్నారు. ప్రతిరోజూ ప్రత్యేక తరగతులు నిర్వహిస్తూ ప్రతిభావంతులతో పాటు వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు.
విద్యా విజయాలు
ఆయన మార్గదర్శకత్వంలో 2018 నుంచి ఇప్పటివరకు 145 మంది విద్యార్థులు ఉపకార వేతనాలకు ఎంపిక కాగా, 60 మంది విద్యార్థులు బాసర రాజీవ్ గాంధీ సాంకేతిక విశ్వవిద్యాలయంలో సీట్లు సాధించారు. ముఖ్యంగా 2026లో జాతీయ ఆదాయ సహ ప్రతిభా ఉపకార వేతన పరీక్షలో 26 మంది విద్యార్థులు ఎంపికై రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానాన్ని సాధించడం మాస్కాపూర్ పాఠశాల విద్యా ప్రగతికి నిదర్శనంగా నిలిచింది. పాఠశాల విద్యార్థులు రాష్ట్ర విద్యా సాంకేతిక కార్యక్రమాల్లోనూ పాల్గొన్నారు.
ఉత్తమ పాఠశాలగా గుర్తింపు
జాడి శ్రీనివాస్ కృషి ఫలితంగా పాఠశాలలో విద్యార్థుల నమోదు గణనీయంగా పెరిగి ప్రస్తుతం 870 మంది విద్యార్థులతో కొనసాగుతోంది. విద్యా ప్రమాణాలు, విద్యార్థుల ప్రగతి, మౌలిక సదుపాయాలు, సమాజ భాగస్వామ్యం తదితర అంశాల్లో పాఠశాల సాధించిన అభివృద్ధికి గుర్తింపుగా 2026 మే నెలలో రాష్ట్ర ఉత్తమ పాఠశాలగా ఎంపికైంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి చేతుల మీదుగా పాఠశాల ప్రతినిధులు అవార్డు అందుకున్నారు.
జపాన్ పర్యటన లక్ష్యం
పాఠశాల అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న జాడి శ్రీనివాస్ జపాన్ పర్యటన ద్వారా అక్కడి విద్యా విధానాలు, బోధనా పద్ధతులు, విద్యార్థుల అభ్యసన విధానాలు, పాఠశాల నిర్వహణలో అనుసరిస్తున్న ఉత్తమ పద్ధతులను అధ్యయనం చేసి, వాటి ద్వారా పొందిన అనుభవాన్ని తెలంగాణ పాఠశాలల్లో విద్యా ప్రమాణాల మెరుగుదలకు వినియోగించాలని ఆకాంక్షిస్తున్నారు.












