ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఉత్తీర్ణులు కాని విద్యార్థులు ధైర్యం కోల్పోవద్దని, భవిష్యత్తుపై ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా సూచించారు. నిర్మల్లోని కేజీబీవీలో ఏర్పాటు చేసిన ప్రత్యేక శిబిరాన్ని ఆయన సందర్శించారు.
సోఫీనగర్ కేజీబీవీలో ఇంటర్మీడియట్ పరీక్షల్లో అనుత్తీర్ణులు అయిన విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక శిబిరాన్ని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడుతూ, పరీక్షల్లో వైఫల్యం జీవితానికి అంతం కాదని, భయాన్ని వీడి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని భరోసా ఇచ్చారు.
విద్యార్థులు తమకున్న సమయాన్ని సద్వినియోగం చేసుకుని తదుపరి పరీక్షల్లో తప్పక ఉత్తీర్ణత సాధించాలని కలెక్టర్ సూచించారు. ముఖ్యంగా బాలికలు ఉన్నత విద్యను అభ్యసించడం ద్వారా సమాజంలో లభించే ఉద్యోగ, ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవాలని ప్రోత్సహించారు.
వివిధ సబ్జెక్టులకు సంబంధించిన మెళకువలను వివరిస్తూ, విద్యార్థులకు ఏవైనా సందేహాలుంటే ఉపాధ్యాయులను సంప్రదించి నివృత్తి చేసుకోవాలని సూచించారు. ఉపాధ్యాయులు ఆచరణాత్మక బోధన అందించడం ద్వారా విద్యార్థుల్లో విషయ పరిజ్ఞానం పెరుగుతుందని, ప్రతి విద్యార్థి ఉత్తీర్ణత సాధించేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఉపాధ్యాయులకు సూచనలు చేశారు.
శిబిరం అనంతరం కలెక్టర్ విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రాజు, మండల విద్యాధికారి సిద్ది పద్మ, కేజీబీవీ ప్రత్యేక అధికారి సుజాత, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.











