ఇటీవల ప్రకటించిన ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలలో బైపీసీ గ్రూప్లో రాష్ట్ర స్థాయిలో 994 మార్కులతో ర్యాంక్ సాధించిన మిర్యాలగూడ మైనార్టీ గురుకుల విద్యార్థిని శివార్ల ధరణిని రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ప్రభుత్వ విప్ వేముల వీరేశం, స్థానిక ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి (బిఎల్ఆర్) తదితరులు ఘనంగా సన్మానించారు.
మిర్యాలగూడ పట్టణానికి చెందిన శివార్ల యాదగిరి, జ్యోతి దంపతుల కుమార్తె అయిన ధరణి, మైనార్టీ గురుకులంలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం బైపీసీ గ్రూప్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి 1000కి 994 మార్కులు సాధించారు. ఈ సందర్భంగా ఆమెను అభినందించడానికి ఎమ్మెల్యే బిఎల్ఆర్ క్యాంపు కార్యాలయంలో ఒక ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ, ధరణి సాధించిన విజయం ఎంతో ప్రశంసనీయమని, కష్టపడి చదివితే విద్యార్థులు ఎలాంటి లక్ష్యాలనైనా చేరుకోవచ్చని అన్నారు. ప్రభుత్వ గురుకులాల్లో కూడా నాణ్యమైన విద్య అందుతుందని, ఇది దానికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.
ప్రభుత్వ విప్ వేముల వీరేశం, స్థానిక ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి లు ధరణిని పుష్పగుచ్ఛాలతో సన్మానించి, ఆమె భవిష్యత్తుకు శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్, డిసిసి అధ్యక్షులు కైలాష్ నేత లు కూడా ధరణి ప్రతిభను కొనియాడారు.
ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నూకల వేణుగోపాల్ రెడ్డి, 6వ వార్డ్ కౌన్సిలర్ ఆడోత్ అశోక్, 6వ వార్డ్ అధ్యక్షులు అంబటి వెంకటకృష్ణ, మిర్యాలగూడ యూత్ అసెంబ్లీ కన్వీనర్ నాగు నాయక్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.












