బోథ్ (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 30
జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో, విద్యార్థుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ జిల్లా కలెక్టర్ రాజర్షి షా జిల్లాలోని అన్ని విద్యాసంస్థలకు జూలై 31 (శుక్రవారం) స్థానిక సెలవు ప్రకటించారు. ఈ సెలవుకు బదులుగా ఆగస్టు 8వ తేదీ (రెండో శనివారం) తరగతులు యథావిధిగా నిర్వహించాలని ఆదేశించారు.
జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు, వాతావరణ శాఖ జారీ చేసిన హెచ్చరికలు, పలు ప్రాంతాల్లో నెలకొన్న ప్రతికూల పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని విద్యార్థుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, డిగ్రీ కళాశాలలు, గురుకులాలు, రెసిడెన్షియల్ విద్యాసంస్థలకు జూలై 31 (శుక్రవారం) స్థానిక సెలవు ప్రకటించినట్లు జిల్లా కలెక్టర్ రాజర్షి షా తెలిపారు.
ఈ సెలవుకు బదులుగా ఆగస్టు 8 (రెండో శనివారం) జిల్లాలోని అన్ని విద్యాసంస్థలు సాధారణంగా పనిచేస్తాయని తెలిపారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ మార్పును గమనించాలని కోరారు.
జిల్లాలో ప్రస్తుతం భారీ వర్షాలు కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజలందరూ అత్యంత అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. అత్యవసర పరిస్థితులు మినహా ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రావద్దని సూచించారు. వాగులు, చెరువులు, కల్వర్టులు, బ్రిడ్జిలు, లోతట్టు ప్రాంతాల వద్దకు వెళ్లకుండా ఉండాలని, ఉప్పొంగి ప్రవహిస్తున్న వరద నీటిని ఎట్టి పరిస్థితుల్లోనూ దాటేందుకు ప్రయత్నించవద్దని హెచ్చరించారు.
లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలు పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ, తల్లిదండ్రులు తమ పిల్లలను వరద ప్రభావిత ప్రాంతాలు, నీటి ప్రవాహాల వద్దకు వెళ్లకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.
వర్షాలు, వరదల కారణంగా ఎలాంటి అత్యవసర పరిస్థితులు ఏర్పడినా లేదా సహాయం అవసరమైనా ప్రజలు కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన 24 గంటల ప్రత్యేక కంట్రోల్ రూమ్ టోల్‌ఫ్రీ నంబర్ 1800 425 1939కు వెంటనే సమాచారం అందించాలని తెలిపారు.
అత్యవసర సమయాల్లో ఎక్కడైనా అకస్మాత్తుగా అగ్నిప్రమాదాలు లేదా ఇతర అత్యవసర పరిస్థితులు తలెత్తితే వెంటనే అగ్నిమాపక శాఖను సంప్రదించాలని సూచించారు. అత్యవసర సహాయం కోసం 8712699212 నంబర్‌కు కాల్ చేసి ఫైర్ డిపార్ట్మెంట్ సేవలను పొందవచ్చని తెలిపారు. ప్రమాదాలు జరిగిన వెంటనే స్పందించి ప్రాణ, ఆస్తి నష్టాలను నివారించేందుకు ప్రజలందరూ ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ప్రజలందరూ జిల్లా యంత్రాంగం, పోలీసు శాఖ, విపత్తు నిర్వహణ బృందాలు, సంబంధిత అధికారుల సూచనలను తప్పనిసరిగా పాటిస్తూ పూర్తి సహకారం అందించాలని జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.












