Markapuram/Pullalacheruvu (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 04
ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంవో) ప్రకారం, ఎల్‌నినో పరిస్థితులు మరింత బలపడి జూలై-సెప్టెంబరు మధ్య ఉగ్రరూపం దాల్చనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచ దేశాలు తీవ్ర వాతావరణ మార్పులను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని ఐరాస సంస్థ హెచ్చరించింది. భారత్‌లోనూ పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.
ఇప్పటికే ఏర్పడిన ఎల్‌నినో పరిస్థితులు మరింత బలపడుతున్నాయని, జూలై, సెప్టెంబరు మధ్యలో అది ఉగ్రరూపం దాల్చుతుందని ఐక్యరాజ్యసమితికి చెందిన ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంవో) హెచ్చరించింది. రాబోయే రోజుల్లో ప్రపంచంలోని చాలా ప్రాంతాల్లో తీవ్రమైన వాతావరణ పరిస్థితి నెలకొంటుందని, దీనిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని ప్రపంచ దేశాలకు సూచించింది.
సాధారణంగా ఎల్‌నినో పరిస్థితిని బలహీనం, మధ్యస్థం, తీవ్రం, అత్యంత తీవ్రంగా డబ్ల్యూఎంవో విభజిస్తుంది. ఈ ఏడాది ఎల్‌నినో పరిస్థితి తీవ్ర స్థాయికి చేరుకుంటుందని, కీలక ప్రాంతాల్లో సగటు సముద్ర ఉష్ణోగ్రత 2 డిగ్రీల సెల్సియస్ పెరగవచ్చని అంచనా వేసింది. ఉత్తరార్ధగోళంలో వచ్చే శరదృతువులో ఎల్‌నినో మరింత బలపడి, దాని ప్రభావం ప్రపంచం అంతా పడుతుందని తెలిపింది. ఇదే సమయంలో భూమధ్య రేఖ వద్ద అట్లాంటిక్ ప్రాంతంలో సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రత ఉంటుందని పేర్కొంది.
ప్రస్తుతం బలపడుతున్న ఎల్‌నినో కారణంగా పలు రీజియన్లలో దుర్భిక్ష పరిస్థితులతో పాటు తీవ్రమైన వర్షపాతం, భూమి, సముద్రంపై తీవ్రమైన వేడిగాలుల ప్రభావం ఉంటుందని డబ్ల్యూఎంవో చీఫ్ సెలెస్టీ సాలో చెప్పారు. 60 డిగ్రీల ఉత్తరం, 60 డిగ్రీల దక్షిణం మధ్య ఉన్న భూభాగంలో సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రత నమోదుకానుంది. జూలై, సెప్టెంబరు నెలల్లో అంచనా వేసిన వర్షపాతం కూడా ఎల్‌నినో బలపడుతోందనడానికి ఊతం ఇస్తోంది. నైరుతి అమెరికా ప్రాంతంలో సాధారణం కంటే ఎక్కువగా, భారత్ ఉపఖండం, ఆస్ట్రేలియాల్లో సాధారణం కంటే తక్కువగా వర్షం కురుస్తుందని డబ్ల్యూఎంవో తెలిపింది. ఉత్తరార్ధగోళంలో వేసవి, ఎల్‌నినో పరిస్థితులతో మధ్య, తూర్పు పసిఫిక్ ప్రాంతంలో హరికేన్లు చెలరేగుతాయి. అయితే అట్లాంటిక్ సముద్రంలో మాత్రం ఆ పరిస్థితి ఉండదు.
దేశ వాతావరణ పరిస్థితుల్లో తీవ్ర వైవిధ్యం కనిపిస్తోంది. రుతుపవనాల్లో మందకొడితనంతో కరువు పరిస్థితులు నెలకొనగా, కొన్ని చోట్ల మేఘ విస్ఫోటాలతో వరదలు ముంచెత్తుతున్నాయి. దేశ వ్యాప్తంగా ఈ సీజన్లో సుమారు 38 శాతం లోటు వర్షపాతం నెలకొంది. కొన్ని ప్రాంతాల్లో మాత్రమే రికార్డు వర్షపాతం నమోదైంది. జూన్ 1 నుంచి జూలై 1 మధ్య వ్యవసాయం, జలాశయాల పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. దేశంలోని 29 రాష్ట్రాల పరిధిలో 79 శాతం భూభాగం లోటు లేదా తీవ్ర లోటు వర్షపాత ప్రాంతాలుగా నిలిచాయి. ఈ నెలలో సాధారణ సగటు 172.9 మిల్లీమీటర్లకు గాను, దేశంలో 108.1 మిల్లీమీటర్ల వర్షమే పడింది. అంటే దేశ వ్యాప్తంగా 37.5 శాతం వర్షపాత లోటు ఏర్పడిందని ఐఎండీ స్పష్టం చేసింది. దేశంలో ఐఎండీ పర్యవేక్షణలో 741 జిల్లాల్లోని 535 జిల్లాల్లో (72 శాతం) లోటు లేదా తీవ్ర లోటు వర్షపాత పరిస్థితులు ఉన్నాయి. కేవలం 201 జిల్లాల్లో (27 శాతం) మాత్రమే సాధారణం లేదా ఎక్కువ వర్షపాతం నమోదైంది.
దేశంలో చాలా ప్రాంతాల్లో కరువు పరిస్థితులు తీవ్రమవుతున్నాయి. జూన్ ప్రారంభంలో కాస్త మెరుగ్గా ఉన్నా, నెలాఖరుకు వచ్చేసరికి కరువు ఛాయలు విజృంభించాయి. దీంతో రైతుల్లో ఆందోళన పెరుగుతోంది. వర్షాలు లేకపోవడం వల్ల రైతులు చెరువులు, రిజర్వాయర్లపై ఆధారపడటం పెరగడం వల్ల అవి అడుగంటిపోయే అవకాశం ఉంది. మరోవైపు, దేశంలో లోటు వర్షపాతం, ఎల్‌నినో పరిస్థితులను కేంద్రం నిశితంగా పరిశీలిస్తోంది. కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తో కలసి హోం మంత్రి అమిత్ షా శుక్రవారం అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించారు. కరువు పరిస్థితులపై అప్రమత్తంగా ఉండాలని కేంద్ర శాఖలన్నింటికీ సూచించారు.












