తెలంగాణలో డిగ్రీ కళాశాలల్లో 2026-27 విద్యా సంవత్సరానికి ప్రవేశాల కోసం దోస్త్ (Degree Online Services, Telangana) నోటిఫికేషన్ ను ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాలకృష్ణ రెడ్డి విడుదల చేశారు. ఈ ప్రక్రియ మూడు దశల్లో జరగనుంది. అర్హులైన విద్యార్థులు రూ. 200 రిజిస్ట్రేషన్ ఫీజుతో దరఖాస్తు చేసుకోవచ్చు.
మొదటి దశ రిజిస్ట్రేషన్లు ఏప్రిల్ 15 నుంచి మే 7 వరకు, వెబ్ ఆప్షన్లు ఏప్రిల్ 30 నుంచి మే 8 వరకు అందుబాటులో ఉంటాయి. మే 14న తొలి దశ సీట్ల కేటాయింపు ఉంటుంది. సీట్లు పొందినవారు ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి.
రెండో దశ రిజిస్ట్రేషన్లు మే 15 నుంచి మే 25 వరకు, వెబ్ ఆప్షన్లు మే 15 నుంచి మే 26 వరకు ఉంటాయి. మే 30న సీట్ల కేటాయింపు జరుగుతుంది. ఈ దశలోనూ సెల్ఫ్ రిపోర్టింగ్ తప్పనిసరి.
మూడో దశ రిజిస్ట్రేషన్లు మే 31 నుంచి జూన్ 15 వరకు, వెబ్ ఆప్షన్లు జూన్ 16 వరకు అందుబాటులో ఉంటాయి. జూన్ 20న సీట్ల కేటాయింపు ఉంటుంది. రెండో, మూడో దశల్లో సీట్లు పొందినవారు కూడా ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి.
అన్ని దశల్లో సీట్లు పొందిన విద్యార్థులు జూన్ 20 నుంచి 27 మధ్య ఆయా కళాశాలల్లో అడ్మిషన్ ప్రక్రియ పూర్తి చేసుకోవాలి. జూలై 1 నుంచి తరగతులు ప్రారంభమవుతాయి. జూన్ 29, 30 తేదీల్లో ఓరియంటేషన్ కార్యక్రమాలు ఉంటాయి.










