రంగారెడ్డి, జూన్ 27
దివ్యాంగుల హక్కుల కోసం పోరాడిన హెలెన్ కెల్లర్ జయంతి సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం వారి సంక్షేమంలో కీలక అడుగు వేసింది. రాష్ట్రంలోని 14 నైబర్‌హుడ్ సెంటర్లకు ఈ-ఆటోలను ప్రారంభించిన మంత్రి సీతక్క, దివ్యాంగులను జాలిపడేవారిగా కాకుండా సమాన భాగస్వాములుగా చూడాలని అన్నారు.
దివ్యాంగుల హక్కుల కోసం జీవితాంతం పోరాడిన హెలెన్ కెల్లర్ జయంతి సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమంలో మరో కీలక అడుగు వేసిందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డా. ధనసరి అనసూయ సీతక్క అన్నారు. రాష్ట్రంలోని 14 నైబర్‌హుడ్ సెంటర్లకు ఈ-ఆటోలను ప్రారంభిస్తూ ఆమె మాట్లాడారు.
ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ దాన కిషోర్, సెర్ప్ సీఈఓ దివ్య దేవరాజన్, సెర్ప్ లో దివ్యాంగుల సంక్షేమ విభాగ డైరెక్టర్ ఎల్ కృష్ణమూర్తి, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ప్రతినిధులు పీయూష్ మిట్టల్, కైలాష్, షాబాద్ మండల సమైక్య అధ్యక్షురాలు, అధికారులు, దివ్యాంగులు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
హెలెన్ కెల్లర్ జీవితం ప్రపంచానికే స్ఫూర్తి అని మంత్రి సీతక్క అన్నారు. చిన్న వయసులోనే చూపు, వినికిడి కోల్పోయినా సంకల్పబలంతో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందికి ఆదర్శంగా నిలిచారని పేర్కొన్నారు. ఆమె చెప్పిన "ఒంటరిగా మనం చాలా తక్కువ చేయగలం... కలిసి ఉంటే ఎంతో సాధించగలం" అనే సందేశం ఈ కార్యక్రమానికి సరిగ్గా సరిపోతుందని అన్నారు.
దివ్యాంగులను జాలి చూపాల్సిన వారిగా కాకుండా సమాజ అభివృద్ధిలో సమాన భాగస్వాములుగా చూడాలన్నదే తెలంగాణ ప్రభుత్వ విధానమని మంత్రి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో దివ్యాంగులకు విద్య, ఉపాధి, పునరావాసం, జీవనోపాధి రంగాల్లో మరిన్ని అవకాశాలు కల్పిస్తున్నామన్నారు. గత రెండు దశాబ్దాలుగా మహిళల సాధికారత కోసం విశేషంగా పనిచేస్తున్న సెర్ప్‌కు ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమ బాధ్యతలను కూడా అప్పగించిందని తెలిపారు. మహిళా సంఘ సభ్యుల దివ్యాంగ పిల్లలకు ఈ లోటు రాకుండా చూసుకునే బాధ్యత అప్పగించామన్నారు.
సెర్ప్ సీఈఓ దివ్యా దేవరాజన్, డైరెక్టర్ కృష్ణమూర్తి ఆధ్వర్యంలో తక్కువ కాలంలోనే దివ్యాంగులను సంఘటితం చేసి రాష్ట్రవ్యాప్తంగా 13 వేలకుపైగా దివ్యాంగుల స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు చేశారని చెప్పారు. ప్రస్తుతం 82 వేల మందికి పైగా సభ్యులు ఈ సంఘాల్లో ఉన్నారని తెలిపారు. స్త్రీనిధి ద్వారా రూ.38.16 కోట్ల రుణాలు, గ్రామ మహిళా సంఘాల ద్వారా రూ.4.13 కోట్ల రుణాలు, రూ.11.62 కోట్ల పొదుపులు, 2,248 మందికి జీవనోపాధి అవకాశాలు కల్పించడం ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు.
ప్రస్తుతం 26 జిల్లాల్లో 74 నైబర్‌హుడ్ సెంటర్ల ద్వారా కమ్యూనిటీ మేనేజ్డ్ రిహాబిలిటేషన్ సర్వీసెస్ కార్యక్రమాన్ని మహిళా సంఘాల ఆధ్వర్యంలో విజయవంతంగా అమలు చేస్తున్నామని చెప్పారు. మండల మహిళా సమాఖ్యల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నైబర్‌హుడ్ సెంటర్లలో దాదాపు మూడు వేల మంది దివ్యాంగ పిల్లలకు ఫిజియోథెరపీ, స్పీచ్ థెరపీ, ప్రత్యేక విద్య, కౌన్సెలింగ్, నైపుణ్యాభివృద్ధి వంటి సేవలు అందుతున్నాయని వివరించారు. తల్లిదండ్రులకు శిక్షణ, కౌన్సెలింగ్‌తో పాటు ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు.












