ముఖ్యమంత్రి ప్రకటించిన కనీస వేతనాల పెంపులో శాస్త్రీయత లేదని, పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస వేతనాన్ని రూ. 26,000కు పెంచాలని సీటీయూ (Centre of Trade Unions) డిమాండ్ చేసింది. ఈ మేరకు కీసర మండల కార్యదర్శి బంగారు నర్సింగ్ రావు రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.
దాదాపు 14 ఏళ్ల తర్వాత వేతనాల సవరణ జరిగినప్పటికీ, పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకోలేదని సీటీయూ నాయకులు ఆరోపించారు. రాష్ట్రంలో కనీస వేతనాలను మూడు జోన్లుగా విభజించి, వేర్వేరుగా ప్రకటించడంతో పాటు, కరువుభత్యాన్ని సరిగా కలపకపోవడాన్ని సీటీయూ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు.
గత ప్రభుత్వ హయాంలో కనీస వేతనాల సలహా మండలి అన్స్కిల్డ్ కార్మికుడికి రూ. 18,019 కనీస వేతనం సూచించిందని, అయితే ప్రస్తుత ప్రభుత్వం రూ. 16,000 మాత్రమే ప్రకటించడం అన్యాయమని నర్సింగ్ రావు పేర్కొన్నారు.
పెరిగిన ధరలు, కనీస వేతన చట్టం, డాక్టర్ అక్రాయిడ్ ఫార్ములా, సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం కనీస వేతనం రూ. 32,000 వరకు ఉండాలని ఆయన అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కార్మికుల జీవన ప్రమాణాలను దృష్టిలో ఉంచుకుని కనీస వేతనాన్ని రూ. 26,000గా నిర్ణయించాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వం తక్షణమే కార్మిక సంఘాల డిమాండ్లను, సలహా మండలి సిఫార్సులను పరిగణనలోకి తీసుకొని వేతనాల సవరణ చేయాలని సీటీయూ కోరింది.











