బైంసా నియోజకవర్గంలోని 144 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి కింద రూ.35.50 లక్షల విలువైన చెక్కులను ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ పంపిణీ చేశారు. పేద ప్రజలకు వైద్య సహాయం అందించడమే ధ్యేయమని ఆయన పేర్కొన్నారు.
ఎస్.ఎస్. జిన్నింగ్ ఫ్యాక్టరీలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ, తాను ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటి నుంచి ఇప్పటి వరకు నాలుగు వేల మందికి పైగా లబ్ధిదారులకు సీఎం సహాయనిధి ద్వారా సహాయం అందించామని తెలిపారు. నిమ్స్ ఆసుపత్రిలో వైద్య సేవల కోసం సుమారు 400 మందికి ఎల్.ఓ.సి.లు మంజూరు చేయించినట్లు చెప్పారు.
ప్రజలకు త్వరితగతిన సహాయం అందించేందుకు తన నివాసంలో ప్రత్యేకంగా సీఎం సహాయనిధి కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. విద్య, వైద్యం, సాగునీటి అభివృద్ధి తన లక్ష్యమని, ముఖ్యమంత్రిని కోరడంతో నియోజకవర్గంలో రూ.200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణానికి అనుమతి లభించిందని చెప్పారు.
బాసర అమ్మవారి ఆలయ అభివృద్ధికి రూ.225 కోట్లు మంజూరు కావడం, ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయడం అదృష్టంగా భావిస్తున్నానని ఎమ్మెల్యే పేర్కొన్నారు. నియోజకవర్గంలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు, ఆసుపత్రుల అభివృద్ధి, 28 ప్యాకేజీకి నిధులు తెప్పించేందుకు కృషి చేస్తానని, ఈ ప్రాజెక్టులు పూర్తయితే తానూర్, కుభీర్ మండలాలు సస్యశ్యామలంగా మారుతాయని అన్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ దత్తాత్రి, పలువురు సీనియర్ నాయకులు, బీజేపీ నాయకులు, వివిధ గ్రామాల సర్పంచ్లు పాల్గొన్నారు.












