ప్రభుత్వ సంక్షేమ పథకాల పంపిణీలో అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తూ, ప్రతిపక్ష బీఆర్ఎస్ కౌన్సిలర్లకు సమాచారం ఇవ్వడం లేదని, ఫోటోకాల్ పాటించడం లేదని బీఆర్ఎస్ నాయకులు మిర్యాలగూడ సబ్ కలెక్టర్కు ఫిర్యాదు చేశారు.
మిర్యాలగూడ మున్సిపల్ పరిధిలో జరుగుతున్న ప్రభుత్వ సంక్షేమ పథకాల పంపిణీ ప్రక్రియపై బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. పథకాల పంపిణీలో నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని, బీఆర్ఎస్ కౌన్సిలర్లకు సమాచారం ఇవ్వకుండా, ఫోటోకాల్ పాటించకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని వారు ఆరోపించారు.
బీఆర్ఎస్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ ఇలియాస్ ఖాన్ నేతృత్వంలో పలువురు కౌన్సిలర్లు బుధవారం సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్ మాలెంపాటిని కలిసి ఫిర్యాదు అందించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ వంటి లబ్ధిదారుల ప్రయోజనాలు ప్రజాస్వామ్యబద్ధంగా అందరికీ అందాలని వారు కోరారు.
అధికారిక కార్యక్రమాలలో స్థానిక ప్రజాప్రతినిధులకు, కౌన్సిలర్లకు ముందస్తు సమాచారం ఇవ్వడం ప్రభుత్వ నిబంధన అని, అయితే ఈ నిబంధనలను అధికారులు పాటించడం లేదని కౌన్సిలర్లు పేర్కొన్నారు. కేవలం అధికార పార్టీ నాయకుల కనుసన్నల్లోనే, వారి కార్యాలయాల్లోనే పథకాల పంపిణీ జరుగుతోందని, దీనివల్ల అర్హులైన లబ్ధిదారులు అయోమయానికి గురవుతున్నారని వారు ఆరోపించారు.
ఈ వ్యవహారంలో సబ్ కలెక్టర్ జోక్యం చేసుకొని, ఇకనుంచి ప్రభుత్వ పథకాల పంపిణీ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులకు, కౌన్సిలర్లకు అధికారికంగా ముందస్తు సమాచారం అందేలా చూడాలని, ప్రభుత్వ ఫోటోకాల్ ఖచ్చితంగా పాటించే విధంగా సంబంధిత అధికారులను ఆదేశించాలని కౌన్సిలర్లు వినతిపత్రంలో కోరారు.












