Hyderabad/Shaikpet (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 29
కడ్తాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన భార్య హత్య కేసులో నిందితుడు వల్లపుదాసు శ్రీనివాస్‌కు జీవిత ఖైదుతో పాటు రూ.5,000 జరిమానా విధిస్తూ షాద్‌నగర్‌లోని 16వ అదనపు ప్రత్యేక సెషన్స్ జడ్జి శ్రీమతి ఎస్. స్వాతిరెడ్డి బుధవారం తీర్పు వెలువరించారు. 2023 జూన్ 12న కర్కల్‌పహాడ్ గ్రామంలోని ఎస్ఎస్ ఫాంహౌస్‌లో ఈ హత్య జరిగింది.
కడ్తాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన భార్య హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదుతో పాటు రూ.5,000 జరిమానా విధిస్తూ షాద్‌నగర్‌లోని 16వ అదనపు ప్రత్యేక సెషన్స్ జడ్జి శ్రీమతి ఎస్. స్వాతిరెడ్డి బుధవారం తీర్పు వెలువరించారు.
పోలీసుల వివరాల ప్రకారం.. 2023 జూన్ 12న కడ్తాల్ మండలం కర్కల్‌పహాడ్ గ్రామంలోని ఎస్ఎస్ ఫాంహౌస్‌లో వల్లపుదాసు శ్రీనివాస్ (43) తన భార్య వల్లపూడాసు స్వరూపను హత్య చేసి అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటనపై కడ్తాల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
కేసు దర్యాప్తులో పోలీసులు సేకరించిన సాక్ష్యాధారాలు, సాక్షుల వాంగ్మూలాలను పరిశీలించిన గౌరవ కోర్టు.. నిందితుడు శ్రీనివాస్‌పై నేరం రుజువైనట్లు నిర్ధారించింది. దీంతో నిందితుడికి జీవిత ఖైదు, రూ.5,000 జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చింది.
ఈ కేసులో మొదటి దర్యాప్తు అధికారిగా కడ్తాల్ ఎస్సై సి. హరిశంకర్ గౌడ్, రెండో దర్యాప్తు అధికారిగా సీఐ జె. ఉపేందర్ రావు, మూడో దర్యాప్తు అధికారిగా ఆమనగల్ సీఐ జె. వెంకటేశ్వర్లు వ్యవహరించారు. కేసుకు సంబంధించిన సాక్షులను కోర్టులో హాజరుపరచడంలో కోర్టు కానిస్టేబుళ్లు జి. సుమిత్ర, కె. దివ్యవాణి సహకరించారు.
కడ్తాల్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ సైదీరెడ్డి ఆధ్వర్యంలో కేసు దర్యాప్తును సమర్థవంతంగా నిర్వహించి, నిందితుడికి శిక్ష పడేలా కృషి చేసిన అధికారులు, సిబ్బందిని ఉన్నత పోలీస్ అధికారులు అభినందించినట్లు ఇన్స్పెక్టర్ సైదీ రెడ్డి తెలిపారు.











