నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మెర గ్రామంలో జరిగిన పసిపాప హత్య ఘటనకు నిరసనగా భైంసా పట్టణంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ రజక సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
భైంసాలోని ఐలమ్మ గద్దె వద్ద జరిగిన నిరసనలో, చాకలి కుటుంబానికి చెందిన రెండు నెలల పసిపాపను హత్య చేసిన దుర్మార్గులను వెంటనే అరెస్ట్ చేసి శిక్షించాలని ఆందోళనకారులు ప్లకార్డులు ప్రదర్శించారు.
బీసీ సంఘం భైంసా డివిజన్ అధ్యక్షుడు సుంకేట మహేష్ బాబు మాట్లాడుతూ, దేవాలయ దర్శనానికి వెళ్ళిన కుటుంబంపై అగ్రకులాల పెత్తందార్లు దాడి చేసి పసిపాపను హత్య చేయడం దారుణమని అభివర్ణించారు. నిందితులందరిపై హత్య కేసు నమోదు చేసి కఠిన శిక్షలు విధించాలని ఆయన డిమాండ్ చేశారు.
బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని, సర్పంచ్‌ను తొలగించాలని, తక్షణ ఆర్థిక సహాయం, ప్రభుత్వ భద్రత కల్పించాలని నిరసనకారులు కోరారు. ప్రభుత్వం స్పందించకుంటే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో బీసీ సంఘం, రజక సంఘం, ఎస్సీ సంఘం నాయకులు పాల్గొన్నారు.


