రంగారెడ్డి జిల్లా, చేవెళ్లలో ఒక దారుణమైన ఘటన చోటుచేసుకుంది. భార్య రాజేశ్వరి, ఆమె ప్రియుడు శరత్‌తో కలిసి భర్త నారగూడం కృష్ణ (35)ను హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు.
వివరాల్లోకి వెళితే, శంకర్పల్లి మండలం పర్వేద గ్రామానికి చెందిన కృష్ణ, 2018లో జీడిమెట్లకు చెందిన రాజేశ్వరిని వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ప్రస్తుతం చేవెళ్లలో నివసిస్తూ కూలీ పనులు చేసుకుంటున్నారు.
ఐదు-ఆరు నెలల క్రితం రాజేశ్వరికి ఇన్స్టాగ్రామ్ ద్వారా శరత్‌తో పరిచయం ఏర్పడి, అది వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ కారణంగా భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయని పోలీసులు తెలిపారు.
గురువారం రాత్రి, మద్యం సేవించి ఇంటికి వచ్చిన కృష్ణతో రాజేశ్వరి గొడవపడింది. ఆ తర్వాత, శరత్‌ను పిలిపించి, ఇద్దరూ కలిసి కృష్ణ కాళ్లు, చేతులు కట్టేసి, ముఖంపై దిండు పెట్టి ఊపిరాడకుండా చేసి హత్య చేశారు. శరత్ కృష్ణ ఛాతీపై బలంగా కొట్టడంతో అతను మృతి చెందినట్లు ప్రాథమిక విచారణలో తేలింది.
హత్య అనంతరం, రాజేశ్వరి భర్తను ఆసుపత్రికి తీసుకెళ్లగా, వైద్యులు మృతిని నిర్ధారించారు. మృతుడి తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు, రాజేశ్వరిని విచారించగా నేరం అంగీకరించింది. ప్రియుడు శరత్‌ను కూడా అదుపులోకి తీసుకుని, ఇద్దరినీ రిమాండ్‌కు తరలించారు.


