ఆలయాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని, ఈ దిశగా అవసరమైన అన్ని చర్యలు చేపడుతుందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి అన్నారు. ఆయన బుధవారం బాసరలో పర్యటించి, పలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ఏర్పాట్లను పరిశీలించారు. ఈ నెల 6వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాసర పర్యటన నేపథ్యంలో ఈ తనిఖీలు చేపట్టారు.
ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి జరుగుతున్న ఏర్పాట్లను సమీక్షించేందుకు సుదర్శన్ రెడ్డి బాసర చేరుకున్నారు. జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందన్ లు ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం, సుదర్శన్ రెడ్డి, కలెక్టర్, ఉర్దూ అకాడమీ చైర్మన్ తో కలిసి బాసర ఆలయాన్ని సందర్శించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం, ముఖ్యమంత్రి పూజలు చేసే ప్రాంతాన్ని, అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసే స్థలాన్ని పరిశీలించారు. అధికారులకు పలు కీలక సూచనలు చేశారు.
ఆలయ అతిథిగృహంలో ఏర్పాటు చేసిన సమావేశంలో సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ, బాసర ఆలయంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు. ఈ అభివృద్ధిలో భాగంగానే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 6వ తేదీన ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నారని తెలిపారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుండి బాసరకు వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా, దర్శనార్థుల సౌకర్యార్థం మెరుగైన ఏర్పాట్లు చేస్తామని సుదర్శన్ రెడ్డి హామీ ఇచ్చారు.
భక్తుల సౌకర్యం, దర్శనాల ప్రక్రియ సజావుగా జరిగేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి పర్యటన విజయవంతం కావడానికి అధికారులు సమన్వయంతో పనిచేసి, పకడ్బందీగా ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు. ఈ పర్యటనలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, భైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్, ఆలయ ఈవో విజయరామారావు, తహసిల్దార్ పవన్ చంద్ర, నిర్మల్ మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు, సిబ్బంది పాల్గొన్నారు.











