బైంసా (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 16
భైంసా మండలంలోని ఒక గ్రామంలో 14 ఏళ్ల బాలికకు జరగాల్సి ఉన్న బాల్య వివాహాన్ని అధికారులు అడ్డుకున్నారు. జిల్లా సంక్షేమ అధికారి ఆదేశాల మేరకు బాలల సంరక్షణ విభాగం, పోలీసు, రెవెన్యూ, పంచాయతీరాజ్ శాఖల అధికారులు గ్రామానికి చేరుకుని బాలిక కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్ ఇచ్చారు.
భైంసా మండలంలోని ఓ గ్రామంలో 14 ఏళ్ల బాలికకు బాల్య వివాహం జరగనున్నట్లు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు, జిల్లా సంక్షేమ అధికారి ఆదేశాలపై జిల్లా బాలల సంరక్షణ విభాగం, పోలీసు, రెవెన్యూ, పంచాయతీరాజ్ శాఖల అధికారులు గురువారం గ్రామానికి చేరుకున్నారు. బాలిక కుటుంబ సభ్యులతో కౌన్సెలింగ్ నిర్వహించి బాల్య వివాహాన్ని అడ్డుకున్నారు.
ఈ సందర్భంగా బాల్య వివాహాల వల్ల బాలికల శారీరక, మానసిక, విద్యా, ఆరోగ్యపరమైన అభివృద్ధిపై కలిగే ప్రతికూల ప్రభావాలు, అలాగే బాల్య వివాహ నిరోధక చట్టం-2006 ప్రకారం తీసుకునే చట్టపరమైన చర్యలపై కుటుంబ సభ్యులకు అధికారులు సమగ్రంగా అవగాహన కల్పించారు.
అధికారుల సూచనలు, కౌన్సెలింగ్‌తో తమ తప్పును గ్రహించిన బాలిక తల్లిదండ్రులు, తమ కుమార్తెకు 18 సంవత్సరాలు పూర్తైన తర్వాత మాత్రమే వివాహం జరిపిస్తామని హామీ ఇస్తూ లిఖితపూర్వక స్వీయ ప్రకటన (సెల్ఫ్ డిక్లరేషన్) అందజేశారు.
ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, చట్టం ప్రకారం అమ్మాయికి 18 సంవత్సరాలు, అబ్బాయికి 21 సంవత్సరాలు పూర్తికాకముందు వివాహం జరపడం నేరమని స్పష్టం చేశారు. బాల్య వివాహాలను నిర్వహించినా, ప్రోత్సహించినా లేదా సహకరించినా సంబంధిత వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
గ్రామాలు, పట్టణాల్లో ఎక్కడైనా బాల్య వివాహాలు జరుగుతున్నట్లు తెలిసిన వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని లేదా చైల్డ్ హెల్ప్‌లైన్–1098కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రజల అప్రమత్తతతోనే బాల్య వివాహాలను పూర్తిగా నిర్మూలించడం సాధ్యమవుతుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో బాలల సంరక్షణ అధికారి మురళి, సూపర్వైజర్ శ్రీజని, కౌన్సెలర్లు శైలజ, కరుణశ్రీ, పోలీసు, రెవెన్యూ, పంచాయతీరాజ్ శాఖల అధికారులు, సోషల్ వర్కర్, చైల్డ్ హెల్ప్‌లైన్ కోఆర్డినేటర్లు, తదితరులు పాల్గొన్నారు.











