నిర్మల్ జిల్లా చించోలిలోని గండిరామన్న అర్బన్ పార్క్‌లో 99 రోజుల ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా వనమహోత్సవం మరియు వనదర్శిని కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొని మొక్కలు నాటారు.
అటవీ మండలాధికారి నాగిని భాను అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపు, జీవవైవిధ్య సంరక్షణ ప్రాముఖ్యతను ప్రజలకు వివరించారు. వృక్షాలు లేకుండా జీవనం లేదని, భావితరాలకు ఆరోగ్యకరమైన వాతావరణం అందించే బాధ్యత మనందరిపైనే ఉందని నాగిని భాను తెలిపారు.
ప్రతి ఒక్కరూ తమ పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవాల సందర్భంగా మొక్కలు నాటి సంరక్షించాలని ఆమె పిలుపునిచ్చారు. అటవీ క్షేత్రాధికారి రామకృష్ణారావు మాట్లాడుతూ, 99 రోజుల కార్యాచరణ లక్ష్యంగా జిల్లాలో పచ్చదనం పెంచేందుకు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు.
నాటిన మొక్కల సంరక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, డిప్యూటీ రేంజ్ అధికారుల పర్యవేక్షణలో మొక్కల పెంపు జరుగుతుందని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో చించోలి బి సర్పంచ్ సాయన్న, కౌన్సిలర్ ఇర్ఫాన్, ఇతర సర్పంచులు, కో-ఆప్షన్ మెంబర్ అస్లం, స్థానిక ప్రజలు, అటవీ సిబ్బంది పాల్గొన్నారు.
వనమహోత్సవం ద్వారా పచ్చదనాన్ని పెంచి, పర్యావరణ పరిరక్షణలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని అధికారులు కోరారు. గండిరామన్న పార్క్‌ను మరింత అందంగా, పచ్చగా తీర్చిద్దేందుకు ప్రజల సహకారం కావాలని విజ్ఞప్తి చేశారు.












