రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ (ఆర్జీయూకేటీ), బాసర ప్రాంగణంలో మహాత్మా జ్యోతిరావు పూలే 199వ జయంతి వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి యూనివర్సిటీ అధికారులు, అధ్యాపకులు, సిబ్బంది హాజరయ్యారు.
ఎస్సీ, ఎస్టీ సెల్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు డాక్టర్ రెవెల్లి అజయ్ అధ్యక్షత వహించారు. యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ (వీసీ) ప్రొఫెసర్ ఎ. గోవర్ధన్, డీన్ డాక్టర్ విట్టల్, పలువురు అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది పూలే చిత్రపటానికి పూలమాలలు సమర్పించి నివాళులర్పించారు.
మహాత్మా జ్యోతిరావు పూలే అణగారిన వర్గాల అభ్యున్నతికి, అంటరానితనం నిర్మూలనకు, మహిళా సాధికారతకు చేసిన సేవలను వీసీ, డీన్ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. పూలే ఆశయాలను స్మరించుకుంటూ, ఆయన చూపిన మార్గంలో నడవాల్సిన ఆవశ్యకతను వివరించారు.
అందరికీ సమాన విద్యను అందించాలనే పూలే ఆకాంక్షలను నెరవేర్చడం ప్రతి పౌరుడి బాధ్యత అని అధికారులు పేర్కొన్నారు. ఆయన జీవితం నుండి స్ఫూర్తి పొంది, సమాజ పురోగతికి పాటుపడాలని వక్తలు పిలుపునిచ్చారు.








