పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు ఉన్నత విద్యను ఉచితంగా అందించే ఫీజు రీయింబర్స్ మెంట్ పథకాన్ని ఎత్తివేసేందుకు ప్రస్తుత ప్రభుత్వం కుట్ర పన్నుతోందని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) జిల్లా కన్వినర్ మూడపెల్లి దినేష్ ఆరోపించారు. ఈ పథకాన్ని కాపాడుతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
ఏబీవీపీ జిల్లా కన్వినర్ మూడపెల్లి దినేష్ ఒక ప్రకటనలో మాట్లాడుతూ, ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలపై హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయడంలో విఫలమైందని, దీని వల్లే విద్యార్థుల నుండి నేరుగా ఫీజులు వసూలు చేసుకోవచ్చని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిందని తెలిపారు. ఈ చర్య పథకాన్ని రద్దు చేయడంలో భాగమని ఆయన ఆరోపించారు.
ఈ పథకం ద్వారా లక్షలాది మంది పేద విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారని, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల వారి భవిష్యత్తుకు ముప్పు వాటిల్లుతోందని దినేష్ ఆవేదన వ్యక్తం చేశారు. విద్యపై పెట్టుబడి మానవ వనరుల సృష్టి కోసమేనని, ఇది ఉచిత పథకం కాదని, ఈ విషయాన్ని ప్రభుత్వం గుర్తించాలని ఆయన సూచించారు.
గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టిందని, అధికారంలోకి వస్తే బకాయిలు చెల్లించి, పథకాన్ని మెరుగుపరుస్తామని హామీ ఇచ్చారని, కానీ ఇప్పుడు విద్యాశాఖ మంత్రిగా ఉండి కూడా పథకాన్ని రద్దు చేసే కుట్రలు జరుగుతున్నాయని దినేష్ విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేద విద్యార్థుల జీవితాలతో ఎందుకు ఆడుకుంటున్నారో సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
ఏబీవీపీ ఆధ్వర్యంలో ఫీజు రీయింబర్స్ మెంట్ పథకాన్ని కాపాడుతామని, అవసరమైతే ప్రభుత్వ మెడలు వంచుతామని దినేష్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.












