జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా డిగ్రీ పరీక్షా కేంద్రాల నిర్వహణపై అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు వారు జిల్లా కలెక్టర్కు మంగళవారం వినతిపత్రం అందజేశారు.
ఏబీవీపీ ఇందూర్ విభాగ్ కన్వినర్ కైరి శశిధర్ మాట్లాడుతూ, నిర్మల్ జిల్లాలోని పలు ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో డిగ్రీ పరీక్షా కేంద్రాలను నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేశారని ఆరోపించారు. దీనిపై సంబంధిత అధికారుల తీరుపై పూర్తిస్థాయి విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
కుబీర్, సారంగాపూర్, లోకేశ్వరం, కుంటాల మండలాల్లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో డిగ్రీ సెంటర్లను ఏ ప్రాతిపదికన ఏర్పాటు చేశారో అధికారులు స్పష్టం చేయాలని ఆయన కోరారు. ఉన్నతాధికారుల నుండి అనుమతులు ఉన్నాయా అని ప్రశ్నించారు.
ప్రిన్సిపాల్లు జూనియర్ కళాశాల బాధ్యతలతో పాటు, డిగ్రీ సెంటర్లలో కూడా విధులు నిర్వహించడంపై అనుమానాలు వ్యక్తం చేశారు. నిబంధనల ప్రకారం ఇది ఎంతవరకు సమంజసమో అధికారులు వివరించాలని అన్నారు.
ఈ వ్యవహారంలో అక్రమాలపై జిల్లా కలెక్టర్ తక్షణమే స్పందించి, విచారణకు ఆదేశించాలని, నిబంధనలు ఉల్లంఘించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ నాయకులు కోరారు. లేనియెడల ఉద్యమ కార్యాచరణ చేపడతామని హెచ్చరించారు.











