కుంటాల మండలం విట్టాపూర్ గ్రామంలో శ్రీ ముత్యాలమ్మ, చందా మహాకాళి, మహాలక్ష్మి, ఐదు చేతుల పోచమ్మ, అడెల్లి పోచమ్మ అమ్మవార్ల పునః ప్రతిష్ఠా మహోత్సవాలు వేద మంత్రోచ్ఛారణల మధ్య భక్తిశ్రద్ధలతో జరుగుతున్నాయి.
జోషి ప్రకాష్ పంతులు, గోసాం అభిషేక్ శర్మ పండితుల ఆధ్వర్యంలో ప్రారంభమైన ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలకు గ్రామస్తులు, చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. గ్రామ యువకులు, మహిళలు, గ్రామ అభివృద్ధి కమిటీ, గ్రామపంచాయతీ సర్పంచ్, పాలకవర్గ సభ్యులు ఈ మహోత్సవాన్ని నిర్వహించడంలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు.
మొదటి రోజున అమ్మవార్ల విగ్రహాల ఊరేగింపు, గోపూజ, గణపతి పూజ, యాగశాల ప్రవేశం, అగ్నిప్రతిష్ఠ, గణపతి హోమం వంటి కార్యక్రమాలు నిర్వహించి, భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.
రెండవ రోజున (గురువారం) ఆవాహిత దేవతా పూజలు, మహాస్నాపనం, స్థాపిత దేవతా హోమాలు నిర్వహించనున్నారు. సాయంత్రం ముతైదువులచే కుంకుమార్చన, హారతి, దర్బార్ సేవలు ఉంటాయని నిర్వాహకులు తెలిపారు.
మూడవ రోజున (శుక్రవారం) ప్రధాన కార్యక్రమంగా యంత్ర, విగ్రహ, శిఖర ప్రతిష్ఠ, ప్రాణ ప్రతిష్ఠ, కుంభాభిషేకం వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య వైభవంగా నిర్వహించనున్నారు. అనంతరం మహాదాశీర్వచనం, అన్నదానం కార్యక్రమాలు జరుగుతాయి. ఈ మూడు రోజుల మహోత్సవాల్లో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవార్ల ఆశీర్వాదాలు పొందాలని నిర్వాహకులు కోరుతున్నారు.












