వేల్పూరు (మనోరంజని తెలుగు టైమ్స్) జూన్ 29
వేల్పూరు శివారులోని కుండలిని జ్ఞానయోగి అవధూత శ్రీ శ్రీ శ్రీ గోవిందగిరి దివ్య యోగాశ్రమములో పౌర్ణమి సందర్భంగా విశ్వకళ్యాణార్థమై గణపతి హోమం, వటసావిత్రి వ్రతం, శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం, గురుపాదుకాపూజోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలకు వివిధ గ్రామాల నుంచి భక్తులు, శిష్యులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
వేల్పూరు శివారులో గల కుండలిని జ్ఞానయోగి అవధూత శ్రీ శ్రీ శ్రీ గోవిందగిరి దివ్య యోగాశ్రమములో సోమవారము పౌర్ణమి సందర్భంగా విశ్వకళ్యాణార్థమై అర్చకుడు అనురాగ్ పాండే గణపతి హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. యజ్ఞానంతరము ధ్యాన మందిరములో భజన కళాకారులు సామూహికంగా భజనలు చేశారు. తదుపరి ముత్తైదువలకు సౌభాగ్యాన్నిచ్చే, కుటుంబ శ్రేయస్సుకై పంచవటి వృక్షం క్రింద అశేష మహిళలు పాల్గొనగా వట సావిత్రి వ్రతాన్ని వైభవంగా నిర్వహించారు. కొండ అశోక్ గౌడ్ వటసావిత్రి వ్రత కథకులుగా వ్యవహరించారు.
వట సావిత్రి వ్రతం, శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం, యజ్ఞ దంపతులుగా వేల్పూర్ కు చెందిన రాజారపు కవిత బాల సతీష్ దంపతులు వ్యవహరించారు. పౌర్ణమిని పురస్కరించుకొని ధ్యాన మందిరములో గల పంచలోహ విగ్రహానికి పూల హారాన్ని అర్పించి, జ్యోతి ప్రకాశనం చేసి గురుపాదుకలకు విశేష పూజలు చేశారు. గురుపాదుకాపూజోత్సవ దంపతులుగా లక్కోర గ్రామానికి చెందిన కొట్టాల శిరీష శ్రీనివాస్ దంపతులు వ్యవహరించారు. గురుపాదుకాపూజలో గోవిందగిరి స్వామి శిష్యులు భజన కీర్తనలను ఆలపించారు.
గణపతి హోమం, వటసావిత్రి వ్రతం, శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం, గురుపాదుకాపూజ లో కమిటీ సభ్యులు, సాయి సేవకులు, ఆర్మూర్, మామిడిపల్లి, పెర్కిట్, లక్కోర, సీతారాం పల్లె, వేల్పూర్, చేంగల్, రెం, భీంగల్, మోతె, జగ్గాసాగర్ తదితర గ్రామాలకు చెందిన ముత్తైదువ మహిళలు, శిష్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.












