ఆషాఢ పౌర్ణమి సందర్భంగా ఆనంద్ బుద్ధవిహార్‌లో వర్షవాస్ ప్రారంభం
బుద్ధుని బోధనలను ఆచరణలో పెట్టాలని పిలుపు
బాసర మండలంలోని టాక్లీ గౌతమ్ నగర్లో గల ఆనంద్ బుద్ధవిహార్‌లో ఆషాఢ పౌర్ణమి (గురు పౌర్ణమి) సందర్భంగా వర్షవాస్ కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో ప్రారంభించారు. ఈ సందర్భంగా బౌద్ధ ఉపాసకులు బుద్ధుని బోధనలను స్మరించుకుని ధమ్మ మార్గంలో నడవాలని సంకల్పించారు. ఆషాఢ పౌర్ణమికి బౌద్ధ ధర్మంలో ప్రత్యేక ప్రాధాన్యత ఉందని కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు తెలిపారు. బుద్ధుడు జ్ఞానోదయం పొందిన అనంతరం పంచవర్గీయ భిక్షువులకు ధమ్మాన్ని బోధించిన రోజు ఆషాఢ పౌర్ణమి అని పేర్కొన్నారు. మానవ జీవితంలో దుఃఖానికి గల కారణాలను వివరిస్తూ దుఃఖ విముక్తికి మార్గాన్ని చూపించారని తెలిపారు. పంచశీల సూత్రాలు, మధ్యమ మార్గం ద్వారా సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వం, సమానత్వం నెలకొల్పవచ్చని వివరించారు. బుద్ధుడు బోధించిన అహింస, కరుణ, మైత్రి, సమానత్వం వంటి విలువలు నేటి సమాజానికి ఎంతో అవసరమని అన్నారు. ప్రతి ఒక్కరూ బుద్ధుని బోధనలను కేవలం వినడమే కాకుండా వాటిని తమ నిత్య జీవితంలో ఆచరించాలని పిలుపునిచ్చారు. మద్యపానం, మత్తు పదార్థాలకు దూరంగా ఉండటం, సత్యం, సద్గుణాలు, నైతిక విలువలను పాటించడం ద్వారా సమాజంలో మంచి మార్పు తీసుకురావచ్చని పేర్కొన్నారు. వర్షాకాలంలో బౌద్ధ భిక్షువులు ఒకే ప్రాంతంలో ఉండి ధమ్మ అధ్యయనం, ధ్యానం, బౌద్ధ బోధనల ప్రచారానికి ప్రాధాన్యత ఇవ్వడం వర్షవాస్ ప్రత్యేకత అని తెలిపారు. ఈ కాలంలో ఉపాసకులు ధమ్మ కార్యక్రమాల్లో పాల్గొని బుద్ధుని బోధనలను అధ్యయనం చేయడంతో పాటు నైతిక జీవన విధానాన్ని అలవర్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీఎస్ఐ జిల్లా అధ్యక్షుడు రమేష్ వాగ్మారే, ఎస్ఎస్డీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వాగ్మారే నారాయణ, బీఎస్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అబ్బారావు వాగ్మారే, పర్యాటక విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆనంద్‌రావు బోతే, రాష్ట్ర సంఘటక్ కాలేవార్ శంకర్, సంజయ్ క్షీరసాగర్, కవితాబాయి టోక్రే, ఆనంద్‌రావు బంసోడే, ఉపాసకులు గంగాధర్ సొన్టక్కే, గౌతమ్ ధావనే, రతన్ ధావనే, లక్ష్మణ్, భీమాబాయి, విజయబాయి, శోభాబాయి, మహామాయబాయి, ఎస్ఎస్డీ సైనికులు, బౌద్ధ ఉపాసకులు, స్థానికులు, తదితరులు పాల్గొన్నారు.












