తిరుపతి, 29-07-2026
తిరుమల యాత్రికులను లక్ష్యంగా చేసుకుని టీటీడీ దర్శనం, వసతి, సేవా టికెట్ల పేరుతో సైబర్ మోసాలకు పాల్పడుతున్న నకిలీ వెబ్సైట్లు, యాప్‌ల పట్ల అప్రమత్తంగా ఉండాలని తిరుపతి జిల్లా పోలీస్ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో 32 నకిలీ వెబ్సైట్లను గుర్తించి తొలగించినట్లు జిల్లా ఎస్పీ గారు తెలిపారు. అధికారిక టీటీడీ వెబ్సైట్, యాప్ ద్వారా మాత్రమే బుకింగ్‌లు చేసుకోవాలని సూచించారు.
తిరుమల యాత్రికులను లక్ష్యంగా చేసుకుని టీటీడీ సేవల పేరుతో సైబర్ మోసాలకు పాల్పడుతున్న నకిలీ వెబ్సైట్లు, యాప్‌ల పట్ల అప్రమత్తంగా ఉండాలని తిరుపతి జిల్లా పోలీస్ శాఖ హెచ్చరించింది. ఈ మేరకు చేపట్టిన చర్యల్లో భాగంగా 32 నకిలీ వెబ్సైట్లను గుర్తించి తొలగించినట్లు జిల్లా ఎస్పీ గారు తెలిపారు.
తిరుమలకు విచ్చేసే భక్తుల సౌకర్యార్థం టీటీడీ దర్శనం, వసతి, ప్రత్యేక ప్రవేశ దర్శనం, సేవా టికెట్లు వంటి సేవలను అధికారిక వెబ్సైట్, మొబైల్ యాప్ ద్వారా అందిస్తోంది. అయితే, భక్తుల విశ్వాసాన్ని ఆసరాగా చేసుకుని కొందరు సైబర్ నేరగాళ్లు టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌ను పోలి ఉండే నకిలీ వెబ్సైట్లు, మొబైల్ యాప్‌లు, సోషల్ మీడియా లింకులను సృష్టించి మోసాలకు పాల్పడుతున్నారు.
ఇటీవల "ttddevasthanam.online" వంటి నకిలీ వెబ్సైట్ల ద్వారా ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలలకు దర్శనం, సేవా టికెట్లు అందుబాటులో ఉన్నట్లు తప్పుడు ప్రచారం చేస్తూ భక్తుల నుంచి నగదు వసూలు చేసేందుకు ప్రయత్నించినట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో తిరుపతి జిల్లా పోలీసు శాఖ, టీటీడీ విజిలెన్స్ విభాగంతో సమన్వయం చేసుకుంటూ ఇటువంటి మోసపూరిత వెబ్సైట్లు, సోషల్ మీడియా లింకులు, అనుమానాస్పద ఆన్లైన్ కార్యకలాపాలపై నిరంతర నిఘా కొనసాగిస్తోంది.
ఇప్పటివరకు తిరుమలలోని వివిధ గెస్ట్‌హౌస్‌లు, వసతి సదుపాయాల పేర్లతో రూపొందించిన 32 నకిలీ వెబ్సైట్లను గుర్తించి, సంబంధిత డొమైన్ సర్వీస్ ప్రొవైడర్ల సహకారంతో తొలగించారు. అయినప్పటికీ సైబర్ నేరగాళ్లు కొత్త పేర్లు, డొమైన్లతో నకిలీ వెబ్సైట్లను మళ్లీ సృష్టించే అవకాశం ఉన్నందున, తిరుమలకు వచ్చే ప్రతి యాత్రికుడు ఆన్లైన్ బుకింగ్‌ల విషయంలో అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని తిరుపతి జిల్లా పోలీసు శాఖ సూచించింది.
దర్శనం, వసతి, సేవా టికెట్ల బుకింగ్‌లను టీటీడీ అధికారిక వెబ్సైట్, అధికారిక మొబైల్ యాప్ ద్వారా మాత్రమే చేసుకోవాలి. సోషల్ మీడియా, వాట్సాప్ తదితర మాధ్యమాల్లో వచ్చే తెలియని లింకులను క్లిక్ చేయకూడదు, వాటి ద్వారా నగదు చెల్లించవద్దు. బుకింగ్‌కు ముందు వెబ్సైట్ URLను జాగ్రత్తగా పరిశీలించి, అది అధికారిక టీటీడీ వెబ్సైటేనా కాదా నిర్ధారించుకోవాలి. తక్కువ ధరలో గదులు, వెంటనే దర్శనం, ప్రత్యేక దర్శనం లేదా సేవా టికెట్లు ఇప్పిస్తామని చెప్పే తెలియని వ్యక్తులు, ఏజెంట్లు లేదా వెబ్సైట్లను నమ్మవద్దు. అనుమానాస్పద వెబ్సైట్, మొబైల్ యాప్ లేదా సోషల్ మీడియా లింక్ కనిపించిన వెంటనే తిరుపతి జిల్లా పోలీసు శాఖ లేదా టీటీడీ విజిలెన్స్ విభాగానికి సమాచారం అందించాలి. సైబర్ మోసానికి గురైనట్లయితే ఆలస్యం చేయకుండా సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాలి.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్., మాట్లాడుతూ, "తిరుమలకు విచ్చేసే ప్రతి భక్తుడి భద్రత, సౌకర్యం తిరుపతి జిల్లా పోలీసు శాఖకు అత్యంత ప్రాధాన్యత. భక్తుల విశ్వాసాన్ని ఆసరాగా చేసుకుని ఆన్లైన్ మోసాలకు పాల్పడే సైబర్ నేరగాళ్లపై పోలీసు శాఖ నిరంతరం నిఘా కొనసాగిస్తోంది. టీటీడీ విజిలెన్స్ విభాగంతో సమన్వయంతో నకిలీ వెబ్సైట్లు, ఆన్లైన్ మోసాలను గుర్తించి వాటిపై చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే 32 నకిలీ వెబ్సైట్లను గుర్తించి తొలగించడం జరిగింది" అని తెలిపారు.











