ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయమై, ప్రేమలో పడి వివాహం చేసుకున్న ఓ జంట విషాదకరంగా మరణించారు. ఏలూరు జిల్లాలో జరిగిన ఈ ఘటనలో ఇద్దరి మృతదేహాలు కాలువలో లభ్యమయ్యాయి. ఈ సంఘటన తీవ్ర కలకలం సృష్టించింది.
ఉంగుటూరు మండలం యర్రమళ్లకు చెందిన చిన మావుళ్లయ్య (25) మరియు శ్రీకాకుళం జిల్లా సింగుపురానికి చెందిన వివాహిత ఇర్రి రమ (34)ల మధ్య సోషల్ మీడియాలో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం ప్రేమగా మారి, ఇద్దరూ కుటుంబాలకు తెలియకుండా వివాహం చేసుకున్నారు.
అయితే, రమకు ఇప్పటికే వివాహం జరిగి ఇద్దరు పిల్లలు ఉన్నారనే విషయం బయటపడటంతో ఇరు కుటుంబాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. రమ కుటుంబ సభ్యులు ఆమెను బలవంతంగా సింగుపురానికి తీసుకెళ్లినట్లు తెలిసింది.
ప్రేమను వీడలేకపోయిన ఈ జంట మళ్లీ కలుసుకున్నారు. చివరిసారిగా చిన మావుళ్లయ్య తన అన్న కుమారుడికి ఫోన్ చేసి, 'రమ వచ్చింది, రేపు మాట్లాడుకుందాం' అని చెప్పినట్లు సమాచారం. ఆ తర్వాత చిన మావుళ్లయ్య కనిపించకుండా పోయాడు.
కాలువ గట్టున చిన మావుళ్లయ్య వస్తువులు కనిపించడంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గాలింపు చర్యల అనంతరం చిన మావుళ్లయ్య మృతదేహం లభ్యమైంది. ఆ తర్వాత, కాలువలోనే రమ మృతదేహం కూడా బయటపడింది. ఈ ఘటనతో రెండు కుటుంబాల్లో విషాదం అలుముకుంది.








