సంగారెడ్డి జిల్లాలోని సదాశివపేటలో అనుమానంతో భార్యను హత్య చేసిన భర్త, అనంతరం తానే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన చోటుచేసుకుంది. ఈ సంఘటనతో ఇద్దరు పిల్లలు అనాథలయ్యారు.
వివరాల్లోకి వెళితే, సిద్ధాపూర్‌కు చెందిన రాజు (43), రాణి (40) దంపతులు. భార్య ప్రవర్తనపై అనుమానం పెంచుకున్న రాజు, శుక్రవారం రాత్రి భార్యతో గొడవపడ్డాడు. ఈ క్రమంలో, రోకలిబండతో భార్య తలపై కొట్టడంతో ఆమె మృతి చెందింది.
భార్య మృతితో తీవ్ర మనస్తాపానికి గురైన రాజు, సమీపంలోని వ్యవసాయ భూమిలో చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనతో వారిద్దరు పిల్లలు అనాథలయ్యారు.
పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఘటనకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. కుటుంబ సభ్యుల నుంచి వాంగ్మూలం సేకరిస్తున్నారు.











