గుజరాత్‌లోని రాజులాలో జరిగిన దారుణం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. తమ చెల్లెలితో ప్రేమ వ్యవహారం నడిపాడన్న కారణంతో ముగ్గురు సోదరులు కలిసి ఓ యువకుడిని అత్యంత కిరాతకంగా కొట్టి చంపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, నిందితులను అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మృతుడు దినేష్, నిందితుల సోదరి సోనాల్ మధ్య ఏడాది క్రితం ప్రేమ వ్యవహారం నడిచింది. గతంలో దినేష్ ఆమెను మొర్బీకి తీసుకెళ్లాడు. రెండు నెలల తర్వాత సోనాల్ తన తండ్రి ఇంటికి తిరిగి రావడంతో, అప్పటి నుంచి ఇరు కుటుంబాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే దినేష్‌ను చంపేస్తామని నిందితులు బెదిరించినట్లు తెలుస్తోంది.
ఏప్రిల్ 18న దినేష్, వ్యవసాయ కూలీలతో కలిసి మొర్బీ నుంచి వచ్చి తన స్నేహితుడి పొలానికి వెళ్లాడు. రాత్రి సుమారు 8:30 గంటల సమయంలో పొలంలో స్నేహితుడితో కూర్చుని ఉండగా, సోనాల్ సోదరులైన రాజేష్, సుర్సింగ్, కేవల్ బైక్‌పై అక్కడికి చేరుకున్నారు. వారు దినేష్‌ను కాస్త దూరంగా తీసుకెళ్లి, 'మా చెల్లిని తీసుకెళ్లి మా పరువు తీశావు' అని వాగ్వివాదానికి దిగారు.
వాగ్వాదం తీవ్రతరం కావడంతో, ముగ్గురు సోదరులు కలిసి దినేష్‌పై దాడికి పాల్పడ్డారు. రాజేష్ తన బెల్టుతో కొట్టగా, సుర్సింగ్ తాడుతో తలపై దాడి చేశాడు. కేవల్ కూడా బెల్టుతో విచక్షణారహితంగా కొట్టాడు. దాదాపు రెండు గంటల పాటు ముగ్గురూ ఒకరి తర్వాత ఒకరు బెల్టులు, తాళ్లతో దినేష్‌ను తీవ్రంగా కొట్టారు. ఈ దాడిలో దినేష్ తీవ్ర గాయాలపాలయ్యాడు.
తీవ్రంగా గాయపడిన దినేష్‌ను వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే, చికిత్స పొందుతూ కొద్దిసేపటికే అతను ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ప్రాథమిక విచారణలో, పరువు కోసమే ఈ హత్య జరిగినట్లు నిర్ధారించారు. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారు.







