శేరిలింగంపల్లికి చెందిన హోప్ ఫౌండేషన్, తెలంగాణ హాకీ చైర్మన్ కొండ విజయ్ కుమార్ ను ఢిల్లీ ఆదాయపు పన్ను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన ఒంటిపై ఉన్న బంగారం, స్థిర, చర ఆస్తుల వివరాలను అధికారులు సేకరిస్తున్నారు.
న్యూఢిల్లీలో జరగనున్న హాకీ ఇండియా అవార్డుల ప్రధానోత్సవానికి హాజరయ్యేందుకు బయలుదేరిన కొండ విజయ్ కుమార్ ను హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అధికారులు అడ్డుకున్నారు. ఆయన పాన్ కార్డును స్వాధీనం చేసుకున్నారు.
న్యూఢిల్లీ విమానాశ్రయంలో దిగిన వెంటనే, అక్కడి ఐటీ అధికారులు కొండ విజయ్ కుమార్ ను అదుపులోకి తీసుకొని విమానాశ్రయంలోనే విచారణ ప్రారంభించారు. ఈ విచారణ సుమారు 12 గంటల పాటు కొనసాగింది.
విచారణలో భాగంగా, కొండ విజయ్ కుమార్ ఒంటిపై ఉన్న బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆయన పేరుతో ఉన్న స్థిర, చర ఆస్తులకు సంబంధించిన వివరాలను కూడా సేకరిస్తున్నట్లు సమాచారం.
12 గంటల విచారణ అనంతరం, అధికారులు కొండ విజయ్ కుమార్ ను అవార్డుల ప్రధానోత్సవానికి వెళ్లడానికి అనుమతించారు. అయితే, అనంతరం మళ్లీ విచారణకు హాజరు కావాలని సూచించినట్లు తెలిసింది. స్వాధీనం చేసుకున్న బంగారం తిరిగి వస్తుందా లేదా అనేది ఆయన పన్ను చెల్లింపుల రికార్డులపై ఆధారపడి ఉంటుంది.












