మెండోరా (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 14
మెండోరా మండలం పోచంపాడులోని భీమన్న ఆలయంలో గుర్తుతెలియని దుండగులు విగ్రహాలకు నిప్పు పెట్టిన ఘటన కలకలం సృష్టించింది. ఈ ఘటనతో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దుండగులను వెంటనే పట్టుకోవాలని పలు సంఘాల నాయకులు, గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.
మెండోరా మండలం పోచంపాడులోని పాత టెలిఫోన్ ఎక్స్చేంజ్ సమీపంలో ఉన్న భీమన్న ఆలయ ప్రాంగణంలో గుర్తుతెలియని దుండగులు ఆలయంలోని విగ్రహాలకు నిప్పు పెట్టిన ఘటన ఉద్రిక్తతకు దారితీసింది.
మంగళవారం ఉదయం ఆలయ సమీపానికి వచ్చిన గ్రామస్థులు ఈ ఘటనను గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న బాల్కొండ సీఐ జానారెడ్డి, మెండోరా ఎస్సై జాదవ్ సుహాసిని సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించి వివరాలు సేకరించారు.
ఈ ఘటనపై పోచంపాడు నాయకపోడు సంఘం ప్రముఖులు, సోంపేట, దూదిగాం, ముక్కాల్, కొత్తపల్లి గ్రామాల నాయకపోడు సంఘాల సభ్యులు, మహిళలు, యువకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలయాన్ని అపవిత్రం చేసిన దుండగులను వెంటనే గుర్తించి కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు.
ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు ఎస్సై జాదవ్ సుహాసిని తెలిపారు.











