ముథోల్ (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 14
ముథోల్ మండల కేంద్రంలో రైతు సునిల్ పంట పొలంలోని విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ నుండి గుర్తుతెలియని దుండగులు కాపర్ వైర్‌ను దొంగిలించారు. పంట పొలాల్లోని ట్రాన్స్ఫార్మర్ల నుండి కాపర్ వైర్ల దొంగతనాలు ఇటీవల కాలంలో పెరిగిపోయాయి. ఈ ఘటనలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ముథోల్ మండల కేంద్రంలోని ధర్మాబాద్ రోడ్డుకు సమీపంలో ఉన్న రైతు సునిల్ పంట పొలంలోని విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ నుంచి గుర్తుతెలియని దుండగులు కాపర్ వైర్‌ను చోరీ చేశారు.
ఇటీవల కాలంలో పంట పొలాల్లో ఏర్పాటు చేసిన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లలోని కాపర్ వైర్లు వరుసగా చోరీకి గురవుతున్నాయి. ఈ ఘటనలపై ఇటీవల ఎస్ఐ సంఘటన స్థలాలను పరిశీలించి వివరాలు సేకరించారు. చోరీలకు పాల్పడిన దుండగులను గుర్తించి చర్యలు తీసుకునేందుకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ప్రస్తుతం వర్షాలు కురవకపోవడంతో రైతులు సోయాబీన్, పత్తి పంటలకు స్ప్రింక్లర్ల ద్వారా నీటిని అందిస్తున్నారు. ఇలాంటి సమయంలో ట్రాన్స్ఫార్మర్లలో కాపర్ వైర్లు చోరీకి గురికావడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చోరీలను అరికట్టేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.











