హైదరాబాద్, 2026-06-05
తెలుగు భాషా దినోత్సవాన్ని పురస్కరించుకొని విశ్వ సాహితీ కళావేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన తెలుగు పలుకు తరతరాల వెలుగు కవితా పోటీలో ప్రముఖ కవి డా పెరుక రాజు విజేతగా నిలిచారు. ఈ పోటీలో దాదాపు 400 మంది కవులు పాల్గొన్నారు.
తెలుగు భాషా దినోత్సవాన్ని పురస్కరించుకొని విశ్వ సాహితీ కళావేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన తెలుగు పలుకు తరతరాల వెలుగు కవితా పోటీకి విశేష స్పందన లభించింది. తెలుగు భాష పట్ల కవుల ప్రేమాభిమానాలకు, సాహితీ సృజనకు అద్దం పట్టిన ఈ పోటీలో దాదాపు 400 మంది కవులు ఉత్సాహంగా పాల్గొని తమ కవితా ప్రతిభను చాటుకున్నారు.
ఈ పోటీలో తన సృజనాత్మక కవిత్వంతో విశిష్ట ప్రతిభ కనబరిచి విజేతగా ముందు వరుసలో నిలిచిన ప్రముఖ కవి డా పెరుక రాజుకు విశ్వ సాహితీ కళావేదిక తరఫున అభినందన పత్రాన్ని అందజేసి, హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
తెలుగు భాష వైభవాన్ని, మాధుర్యాన్ని, భావితరాలకు అందించాల్సిన బాధ్యతను తన కవిత్వంలో ప్రతిబింబించిన డా. పెరుక రాజు సాహితీ కృషి అభినందనీయమని నిర్వాహకులు పేర్కొన్నారు. ఆయన అక్షర ప్రయాణం మరిన్ని విజయాలతో కొనసాగాలని, ఆయన కలం నుంచి తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసే మరెన్నో సాహితీ సుమాలు విరబూయాలని ఆకాంక్షించారు.
మాతృభాష మన గర్వకారణం. మన ఆలోచనలకు ఆత్మ, మన సంస్కృతికి మూలం మాతృభాష. మన తెలుగు భాషను ప్రేమిద్దాం, గౌరవిద్దాం, భావితరాలకు అందిద్దాం. భాష ఉంటే భావం ఉంటుంది, భావం ఉంటే భవిష్యత్తు ఉంటుంది. తెలుగు భాష కలకాలం జీవించాలి, తెలుగు తేజం ప్రపంచమంతా విరజిల్లాలి అని విశ్వ సాహితీ కళావేదిక చైర్పర్సన్ పేర్కొన్నారు.
తెలుగు కేవలం సంభాషణకు పరిమితమైన భాష కాదని, తరతరాల చరిత్రను, సంస్కృతిని, సాహితీ సంపదను తనలో దాచుకున్న మహాభాష అని వారు పేర్కొన్నారు. మాతృభాషను ప్రేమించడం, గౌరవించడం, పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించాలని పిలుపునిచ్చారు.
అమ్మ పలుకులోని మమకారం, మట్టి పరిమళం మన తెలుగు. మన మూలాలను మోసే మాతృభాషను ప్రేమించడం, గౌరవించడం ప్రతి తెలుగువారి బాధ్యత అని డా పెరుక రాజు పేర్కొంటూ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా శ్రీమతి కొల్లి రమావతి, చైర్పర్సన్ జి. భవాని, మహిళా అధ్యక్షురాలు అంజలి కుమారి, తెలంగాణ విభాగం శ్రీకాంత్, జాతీయ కార్యదర్శి భారతి దేవి, రాష్ట్ర మహిళా కార్యదర్శితో పాటు విశ్వ సాహితీ కళావేదిక బృందం డా పెరుక రాజును అభినందించింది.
జై తెలుగు జై భారత్ అనే స్ఫూర్తితో తెలుగు భాష చిరంజీవిగా నిలవాలని, తెలుగు అక్షరాల వెలుగు ప్రపంచమంతా ప్రసరించాలని ఆకాంక్షించారు.










