ప్రజా సేవే తన లక్ష్యమని, భారీ వర్షాల నేపథ్యంలో అత్యవసర పరిస్థితుల్లో మండల కేంద్రమైన ముథోల్ ప్రజలకు ఉచిత వాహన సేవ అందించేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని ఉప సర్పంచ్, సామాజిక కార్యకర్త గడ్డం సుభాష్ తెలిపారు. గతంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించే అవకాశం తనకు లభించిందని, అదే సేవా స్ఫూర్తితో ప్రస్తుతం ప్రజలకు అవసరమైన సమయంలో అండగా నిలవాలని నిర్ణయించుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.
ఎవరైనా అకస్మాత్తుగా అనారోగ్యానికి గురైనా, రోడ్డు ప్రమాదానికి గురైనా, గుండెపోటు, శ్వాస సంబంధిత సమస్యలు లేదా ఇతర అత్యవసర ఆరోగ్య పరిస్థితులు ఎదురైనా వెంటనే స్పందిస్తానని తెలిపారు. గర్భిణీ స్త్రీలను ఆసుపత్రికి తరలించాల్సిన పరిస్థితి వచ్చినా పగలు–రాత్రి అనే తేడా లేకుండా, అర్థరాత్రి అయినా సరే తన సొంత వాహనంలో భైంసా ప్రభుత్వ ఆసుపత్రికి లేదా అవసరమైన వైద్య కేంద్రానికి ఉచితంగా తీసుకెళ్లేందుకు సిద్ధంగా ఉంటానని చెప్పారు.
భారీ వర్షాల కారణంగా రవాణా సౌకర్యాలు అందుబాటులో లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. మానవత్వమే మహోన్నతమైన సేవ అనే భావనతో అత్యవసర సమయంలో ప్రజలకు అండగా నిలిచి తన వంతు బాధ్యతను నిర్వర్తిస్తానని పేర్కొన్నారు.
ప్రజలకు అవసరమైన సమయంలో వారికి తోడుగా ఉండటం తన బాధ్యతగా భావిస్తున్నానని, గతంలో ఎలా ప్రజలకు అండగా నిలిచానో ఇప్పుడు కూడా అదే సేవా నిబద్ధతతో అందుబాటులో ఉంటానని తెలిపారు. ఎలాంటి అత్యవసర పరిస్థితి ఎదురైనా ప్రజలు సంకోచించకుండా పగలైనా, రాత్రైనా తనను సంప్రదించవచ్చని ఆయన తెలిపారు.











