రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులకు ఆధునిక వ్యవసాయ పద్ధతులపై అవగాహన సదస్సులు నిర్వహించారు. వరి కొయ్యకాళ్లను కాల్చడం వల్ల కలిగే నష్టాలు, ప్రత్యామ్నాయ పద్ధతులు, పచ్చిరొట్ట ఎరువుల ప్రాముఖ్యత వంటి అంశాలపై అధికారులు రైతులకు వివరించారు.
బోయినిపల్లి మండలంలోని వివిధ గ్రామాల్లో జరిగిన ఈ సదస్సుల్లో వ్యవసాయ విస్తరణ అధికారులు శ్రీదేవి, రజిత, రవళి పాల్గొన్నారు. వరి కోత అనంతరం పొలాల్లో మిగిలే వరి కొయ్యకాళ్లను కాల్చకుండా, వాటిని రోటోవేటర్ సహాయంతో భూమిలో కలియదున్నాలని సూచించారు. ఒక ఎకరానికి సుమారు 150 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వాడకం వల్ల వరి కొయ్యకాళ్లు త్వరగా మురిగి, నేలకు సేంద్రియ కర్బనం అందుతుందని తెలిపారు.
వరి కొయ్యకాళ్లను కాల్చడం వల్ల వాతావరణ కాలుష్యంతో పాటు, నేలలోని సూక్ష్మజీవులు, సేంద్రియ కర్బనం నశిస్తాయని అధికారులు హెచ్చరించారు. అంతేకాకుండా, కొయ్యకాళ్లు కాల్చే సమయంలో వచ్చే మంటలు, వేడి గాలుల వల్ల పశువుల కొట్టాలు, మేత ప్రాంతాలు దెబ్బతినే ప్రమాదం ఉందని, రైతులు కూడా ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు.
రైతులు వరి కొయ్యకాళ్లను కాల్చకుండా రోటోవేటర్తో దున్నుకోవాలని, వేసవిలోతు దుక్కులు చేయాలని అధికారులు సూచించారు. పచ్చిరొట్ట పంటల సాగును ప్రోత్సహించాలని, జీలుగు విత్తనాలను ఎకరానికి 12 కిలోల చొప్పున విత్తి, పూత దశలో నేలలో కలియదున్నినట్లయితే ఎకరానికి 6–8 టన్నుల పచ్చిరొట్ట ఎరువు లభిస్తుందని, తద్వారా ఎరువుల వినియోగాన్ని తగ్గించుకోవచ్చని వివరించారు.
వానాకాలంలో రైతులు సన్న రకాల వరి విత్తనాలనే సాగు చేయాలని అధికారులు సూచించారు. తడగొండ, విలాసాగర్, నర్సింగాపూర్ గ్రామాల్లో నిర్వహించిన ఈ అవగాహన కార్యక్రమాల్లో రైతులకు ఆధునిక వ్యవసాయ పద్ధతులపై విస్తృతంగా వివరించారు.











