మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా డిప్యూటీ కలెక్టర్ (ఆర్డీవో) కె. వంశీ మోహన్‌పై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసిన అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు, ఆయనకు సంబంధించిన ఎనిమిది ప్రాంతాల్లో గురువారం భారీ సోదాలు నిర్వహించారు. ఈ దాడుల్లో ప్రభుత్వ భూముల అక్రమ కేటాయింపులు, భారీ అక్రమాస్తులు బయటపడినట్లు సమాచారం.
తెలంగాణలో అవినీతి అధికారులపై ఏసీబీ తన ఉక్కుపాదాన్ని కొనసాగిస్తోంది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా డిప్యూటీ కలెక్టర్ (ఆర్డీవో) కె. వంశీ మోహన్‌పై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసిన నేపథ్యంలో, ఏసీబీ అధికారులు గురువారం తెల్లవారుజాము నుంచి ఏకకాలంలో పలు ప్రాంతాల్లో సోదాలు చేపట్టారు. వంశీ మోహన్‌తో పాటు ఆయన బంధువులు, సన్నిహితులకు చెందిన మొత్తం ఎనిమిది ప్రాంతాల్లో తనిఖీలు జరిగినట్లు తెలిసింది.
గతంలో శేరిలింగంపల్లి సహా పలు కీలక ప్రాంతాల్లో ఆర్డీవోగా పనిచేసిన వంశీ మోహన్, తన అధికారాన్ని దుర్వినియోగం చేసి ప్రభుత్వ భూములను అక్రమంగా కాజేసినట్లు ఆరోపణలున్నాయని ఏసీబీ వర్గాలు పేర్కొన్నాయి. ప్రాథమిక విచారణలో, అబ్దుల్లాపూర్ మెట్, పిగ్లీపురం ప్రాంతాల్లో సుమారు ఎనిమిది ఎకరాల ప్రభుత్వ భూమిని అక్రమంగా స్వాధీనం చేసుకున్నట్లు గుర్తించినట్లు సమాచారం. ఈ భూమిని తన మామ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించి, అనంతరం ఓ రియల్టర్‌కు బదిలీ చేసినట్లు అధికారులు అనుమానిస్తున్నారు.
ఈ అక్రమాలకు ప్రతిఫలంగా, కుటుంబ సభ్యుల పేరిట పది విలువైన ప్లాట్లు ‘గిఫ్ట్ డీడ్’ రూపంలో పొందినట్లు ఏసీబీ ఆధారాలు సేకరించినట్లు తెలిసింది. హైదరాబాద్‌తో పాటు పలు ప్రాంతాల్లో వంశీ మోహన్‌కు సంబంధించిన వందల కోట్ల రూపాయల విలువైన స్థిరాస్తులు ఉన్నట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. సోదాల్లో భాగంగా భారీగా ఆస్తి పత్రాలు, బ్యాంకు డిపాజిట్లు, బంగారం, నగదు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.
ప్రభుత్వ భూములను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టి కోట్లాది రూపాయల లంచాలు, ప్లాట్లు స్వీకరించిన వ్యవహారంపై ఏసీబీ లోతుగా దర్యాప్తు కొనసాగిస్తోంది. ఈ ఘటన రెవెన్యూ వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది. పూర్తి స్థాయి విచారణ అనంతరం మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.












