తెలంగాణ రాష్ట్రంలో యూరియా కొరత సమస్యపై రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో, ఆన్లైన్ విధానాన్ని రద్దు చేసి, ప్రత్యక్ష సరఫరా చేయాలని కోరుతూ న్యాయపోరాటం చేసేందుకు మాజీ జడ్పిటిసి ఫోరం సిద్ధమైంది.
రైతులకు అవసరమైన యూరియా ఎరువులు అందుబాటులో లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఈ సమస్యపై మాజీ జడ్పిటిసి ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉమ్మన్నగారి మనోహర్ రెడ్డి, సీనియర్ న్యాయవాది రచనరెడ్డిను కలిసి చర్చించారు.
ప్రస్తుతం అమలులో ఉన్న ఆన్లైన్ విధానం వల్ల సాంకేతిక సమస్యలు, నెట్వర్క్ లోపాలు, సరైన సమాచారం లేకపోవడం వంటి కారణాలతో రైతులు సరైన సమయంలో యూరియా పొందలేక పంటలు నష్టపోతున్నారని మనోహర్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలో, యూరియా సరఫరాలో ఆన్లైన్ విధానాన్ని తక్షణం రద్దు చేసి, రైతులకు నేరుగా ప్రభుత్వం ద్వారా యూరియాను అందుబాటులోకి తేవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ అంశంపై న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసి రైతుల సమస్యకు చట్టపరమైన పరిష్కారం తీసుకురావాలని సీనియర్ న్యాయవాదిని కోరారు.
రైతుల కోసం అవసరమైన ఎరువులు సమయానికి అందకపోతే పంటలపై తీవ్ర ప్రభావం పడుతుందని, దీని వల్ల రైతుల ఆర్థిక పరిస్థితి మరింత దెబ్బతినే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి యూరియా కొరతను నివారించాలని కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నట్లు మనోహర్ రెడ్డి వెల్లడించారు.


