రాష్ట్రంలో వ్యవసాయ అనుబంధ రంగాలు, ముఖ్యంగా ఉద్యాన, పాడి, మత్స్యశాఖలు నిధుల లేమితో తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయాయి. గత రెండేళ్లుగా కొత్త పథకాలు అమలు కాకపోవడం, బకాయిలు పేరుకుపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
గతంలో గణనీయమైన ప్రగతి సాధించిన వ్యవసాయ అనుబంధ రంగాలు, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నిధుల కొరతతో వెనుకబడ్డాయి. ఉద్యాన శాఖలో కొత్త పథకాలు లేకపోవడంతో కూరగాయల సాగును రైతులు వదిలేస్తున్నారు. డ్రిప్, స్పింకర్ల సబ్సిడీల కింద రూ.930 కోట్ల బకాయిలు పేరుకుపోయినట్లు అంచనా.
పాడి రైతులకు లీటర్కు రూ.4 చొప్పున ఇచ్చే ప్రోత్సాహకాలు నిలిచిపోయాయి. దీంతో దాదాపు రూ.5 కోట్ల బకాయిలు పేరుకుపోయాయి. గొర్రెలు, బర్రెలు, ఆవుల పంపిణీ పథకాలు కూడా నిలిచిపోయాయి. విజయ డెయిరీకి రూ.50 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉంది.
మత్స్యశాఖలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. లబ్ధిదారులకు చెల్లించాల్సిన బకాయిలు రూ.190 కోట్లకు చేరుకున్నాయి. చేప పిల్లల పంపిణీ గత రెండేళ్లుగా నామమాత్రంగానే సాగుతోంది. కేంద్ర నిధులతోనే శాఖ కార్యకలాపాలు కొనసాగుతున్నాయని తెలుస్తోంది.
ఈ పరిస్థితులు వ్యవసాయ అనుబంధ రంగాల భవిష్యత్తుపై ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రభుత్వం తక్షణమే నిధుల కేటాయింపులు, పథకాల అమలుపై దృష్టి సారించాలని రైతులు కోరుతున్నారు.








