ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ శుక్రవారం కుంటాల మండలంలోని కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి, ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ పారదర్శకంగా జరగాలని అధికారులను ఆదేశించారు.
ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ శుక్రవారం కుంటాల మండల కేంద్రం, అంబకంటి గ్రామాల్లో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వ మద్దతు ధరకే విక్రయించుకోవాలని సూచించారు.
కొనుగోలు ప్రక్రియను టోకెన్ నంబర్ల ప్రకారం పారదర్శకంగా నిర్వహించి, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల్లో అవకతవకలకు తావులేకుండా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
నిబంధనలు ఉల్లంఘిస్తే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. రైతు దోనికేని లింగంను ఈ సందర్భంగా ఎమ్మెల్యే శాలువాతో సన్మానించారు. రైతు బాగుంటేనే దేశం బాగుంటుందని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో కుంటాల సర్పంచ్ జక్కుల గజేందర్, సహకార సంఘం అధ్యక్షుడు సట్ల గజ్జారం, మాజీ ఎంపీపీలు జీవీ రమణారావు, అప్క గజ్జారం, కుమ్మరి గజేందర్, భోగ గోవర్ధన్, తోట రఘు, తాటి శివ తదితరులు పాల్గొన్నారు.












