రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని గోదాములకు తరలించే ప్రక్రియను వేగవంతం చేయాలని, నిల్వ ప్రక్రియను పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. శుక్రవారం సారంగాపూర్ మండలంలోని చించోలి (బి) గ్రామంలోని గోదామును ఆయన పరిశీలించారు.
జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులతో కలిసి చించోలి (బి) గ్రామంలోని ధాన్యం గోదామును సందర్శించి, అన్లోడింగ్ ప్రక్రియను సమీక్షించారు. ధాన్యం అన్లోడ్ అవుతున్న తీరును పరిశీలించి, అధికారులకు పలు సూచనలు చేశారు.
గోదాములో నిల్వ ఉన్న ధాన్యం వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. తగినంత మంది హమాలీలను వినియోగించి, అన్లోడింగ్ ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని, లారీలను త్వరితగతిన ఖాళీ చేయాలని ఆయన ఆదేశించారు.
అన్లోడింగ్ పూర్తయిన వెంటనే లారీలను తిరిగి కొనుగోలు కేంద్రాలకు పంపాలని, కొనుగోలు కేంద్రాలలో ధాన్యం నిల్వ ఉండకుండా చూడాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ ప్రక్రియను అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్, పౌరసరఫరాల అధికారులు రాజేందర్, సుధాకర్, తహసిల్దార్ విజయ కాంతారావుతో పాటు ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.












