కుంటాల మండలం, అంధకూర్ గ్రామ రైతులు తమ పంటలకు గిట్టుబాటు ధర కల్పించేందుకు మొక్కజొన్న, జొన్న కొనుగోలు కేంద్రాన్ని వెంటనే ఏర్పాటు చేయాలని స్థానిక ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్‌ను కోరారు. ఈ మేరకు గ్రామ సర్పంచ్ ప్రవళి ప్రశాంత్, వార్డు సభ్యులు ముత్యం, నాయకులు విక్రమ్, వెంకటేష్ ఆధ్వర్యంలో రైతులు వినతి పత్రం సమర్పించారు.
గ్రామంలో మొక్కజొన్న, జొన్న పంటలు కోత దశకు చేరుకున్నప్పటికీ కొనుగోలు కేంద్రం లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. మార్కెట్‌కు దూరంగా పంటను తరలించడం భారంగా మారిందని, మద్దతు ధర కూడా అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే రైతుల సమస్యలను శ్రద్ధగా విని సానుకూలంగా స్పందించారు. రెండు నుంచి మూడు రోజుల్లో అంధకూర్ గ్రామంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయిస్తామని హామీ ఇచ్చారు.
దీనికి అవసరమైన చర్యలు వెంటనే తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేస్తానని పేర్కొన్నారు. ఎమ్మెల్యే హామీతో గ్రామ రైతుల్లో ఆశలు పెరిగాయి. త్వరలోనే కొనుగోలు కేంద్రం ప్రారంభమవుతుందనే నమ్మకంతో రైతులు సంతోషం వ్యక్తం చేశారు.












