విజయనగరం, జూలై 28
విజయనగరం జిల్లా చెల్లూరు హైవేపై సోమవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. దైవ దర్శనానికి బయలుదేరిన బొలెరో వాహనాన్ని వెనుక నుంచి వేగంగా దూసుకొచ్చిన లారీ ఢీకొనడంతో ఈ విషాదం నెలకొంది. ఈ ప్రమాదంలో బాలుడు సహా ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో 13 మందికి తీవ్ర గాయాలయ్యాయి.
విజయనగరం జిల్లా చెల్లూరు హైవేపై సోమవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దైవ దర్శనానికి బయలు దేరిన ఓ కుటుంబంలో ఊహించని విషాదం నెలకొంది. చెల్లూరు వద్ద జాతీయ రహదారిపై ఆగి ఉన్న బొలెరో వాహనాన్ని ఓ లారీ వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బాలుడు సహా ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరో 13 మందికి తీవ్ర గాయాలయ్యాయి.
ప్రమాద బాధితులంతా అనకాపల్లి జిల్లా పద్మనాభం మండలం బొచ్చపేట గ్రామానికి చెందినవారు. వీరంతా కలిసి ఒడిశా రాష్ట్రం రాయగడలో కొలువైన మజ్జి గౌరమ్మ అమ్మవారి దర్శనానికి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. అందుకోసం ఓ బొలెరో వాహనాన్ని అద్దెకు తీసుకొని, ఆ వాహనంలో మొత్తం 16 మంది ప్రయాణికులు బయలుదేరారు. వీరిలో ఐదుగురు మహిళలు కూడా ఉన్నారు.
వీరు ప్రయాణిస్తున్న వాహనం విజయనగరం జిల్లా చెల్లూరు సమీపానికి చేరుకోగానే ఈ ఘోర ప్రమాదం జరిగింది. జాతీయ రహదారి పక్కన ఆగి ఉన్న బొలెరో వాహనాన్ని వెనుక నుంచి వచ్చిన ఓ లారీ బలంగా ఢీకొట్టింది. లారీ అతి వేగంగా రావడంతో ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉంది. బొలెరో వాహనం తీవ్రంగా దెబ్బతింది.
ఈ ఘటనలో బొచ్చపేటకు చెందిన రాంబాబు (50), నారాయణరావు (50) తో పాటు.. మోహన్ నాయుడు (8) అనే ఎనిమిదేళ్ల బాలుడు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో రాంబాబు, నారాయణరావు ఇద్దరూ పెయింటింగ్ పనులు చేసుకుంటూ తమ కుటుంబాలను పోషించుకుంటున్నారు. ఇప్పుడు వారిద్దరూ మృతి చెందడంతో ఆయా కుటుంబాలు పెద్ద దిక్కును కోల్పోయి శోకసంద్రంలో మునిగిపోయాయి.
పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.












