నిర్మల్ జిల్లా, సారంగాపూర్ మండలంలో ఆదివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. వ్యవసాయ పనుల నిమిత్తం వెళ్తున్న యువకుడి ద్విచక్ర వాహనాన్ని అతివేగంతో దూసుకొచ్చిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.
ప్రమాదానికి గురైన యువకుడిని సోనాపూర్ తాండకు చెందిన సబ్లె అజయ్ (21)గా గుర్తించారు. అతను డీజిల్ కోసం చించొలి(బి) ఎక్స్ రోడ్డులోని పెట్రోల్ బంక్‌కు వెళ్లి తిరిగి వస్తుండగా, మహిళా ప్రాంగణం వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది.
ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు, ముందు వెళ్తున్న వాహనాలను ఓవర్టేక్ చేసే క్రమంలో అజయ్ ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ తాకిడికి యువకుడి కాళ్లు, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి.
ప్రమాదం జరిగిన వెంటనే చుట్టుపక్కల వారు స్పందించి, అజయ్‌కు 108 అంబులెన్స్ ద్వారా నిర్మల్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతనికి వైద్య చికిత్స కొనసాగుతోంది.
ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు, ప్రమాదానికి కారణమైన ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్ పరశురాం వాగ్మారెపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. ఘటనపై విచారణ జరుగుతోంది.












