ఝార్ఖండ్‌లోని చత్రా జిల్లాలో సోమవారం రాత్రి సంభవించిన ఘోర ఎయిర్ ఆంబులెన్స్ ప్రమాదంలో రోగితో సహా ఏడుగురు వ్యక్తులు దుర్మరణం చెందారు. ఈ దుర్ఘటనలో ఇద్దరు పైలట్లు, ఇద్దరు వైద్య సిబ్బంది కూడా ప్రాణాలు కోల్పోయారు. గాయపడిన రోగిని మెరుగైన వైద్యం కోసం ఢిల్లీకి తరలించే ప్రయత్నంలో ఈ విషాదం చోటుచేసుకుంది.
లాతేహార్ జిల్లా చాంద్వాకు చెందిన సంజయ్ (41) అనే వ్యక్తి గత వారం తన హోటల్లో జరిగిన షార్ట్ సర్క్యూట్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. 65% కాలిన గాయాలతో బాధపడుతున్న అతన్ని మెరుగైన చికిత్స నిమిత్తం ఢిల్లీకి తరలించాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు. ఇందుకోసం రూ.8 లక్షలు అప్పు చేసి ఎయిర్ అంబులెన్స్‌ను ఏర్పాటు చేసుకున్నారు.
సోమవారం సాయంత్రం రాంచీ నుంచి ఢిల్లీకి బయలుదేరిన ఈ విమానం చత్రా జిల్లాలో కూలిపోయింది. ఈ ప్రమాదంలో సంజయ్‌తో పాటు అతని భార్య అర్చన, బంధువు ధ్రువ్ కుమార్, ఇద్దరు పైలట్లు, ఇద్దరు వైద్య సిబ్బంది అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.
ప్రమాదానికి గల కారణాలపై అధికారులు విచారణ చేపట్టారు. సంఘటనా స్థలానికి చేరుకున్న సహాయక బృందాలు శిథిలాల నుంచి మృతదేహాలను వెలికితీసే పనిని చేపట్టాయి. ఈ దుర్ఘటనపై స్థానికులు, సంబంధిత వర్గాల నుంచి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తమవుతోంది.
ప్రభుత్వం తరపున సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని, ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపి నివేదిక సమర్పించాల్సిందిగా ఆదేశించినట్లు అధికారులు తెలిపారు.


