హైదరాబాద్, జులై 02
తెలంగాణలో పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తుండగా, మరికొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు నమోదవుతున్నాయి. ఇవాళ, రేపు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు దంచికొడతాయని వాతావరణ శాఖ తెలిపింది. దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు విస్తరించడంతో, రాబోయే 24 నుంచి 72 గంటల వ్యవధిలో తెలంగాణతోపాటు దేశంలోని మరో 23 రాష్ట్రాల్లో భారీ నుండి అతిభారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ పేర్కొంది.
తెలంగాణలో పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తుండగా, మరికొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు నమోదవుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం, వాతావరణ శాఖ అధికారులు రాష్ట్ర ప్రజలకు వర్షాలపై కీలక విషయాన్ని వెల్లడించారు. ఇవాళ, రేపు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు దంచికొడతాయని వాతావరణ శాఖ తెలిపింది.
దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు విస్తరించాయి. గత నాలుగు రోజులుగా వేగం పుంజుకున్న రుతుపవనాల కారణంగా, రాబోయే 24 నుంచి 72 గంటల వ్యవధిలో తెలంగాణతోపాటు దేశంలోని మరో 23 రాష్ట్రాల్లో భారీ నుండి అతిభారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ పేర్కొంది.
ఈ వారంలో బంగాళాఖాతంలో వరుసగా రెండు శక్తివంతమైన అల్పపీడన ప్రాంతాలు ఏర్పడనున్నాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ కారణంగా రుతుపవనాలు మరింత బలపడి విస్తారంగా వర్షాలు కురుస్తాయని చెబుతున్నారు.
వాతావరణ శాఖ అధికారుల అంచనా ప్రకారం, జులై 1 నుంచి జులై 4వ తేదీ వరకు తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈరోజు బుధవారం అదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం అంచనా వేసింది.
వర్షాలతో పాటు పలు ప్రాంతాల్లో భారీగా ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులతోపాటు పలు ప్రాంతాల్లో పిడుగులు కూడా పడే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. వర్షాలు, ఈదురుగాలుల సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చెట్ల కింద ఉండొద్దని, విద్యుత్ స్తంభాలు, భారీ హోర్డింగ్లు ఉన్న ప్రాంతాల్లో వేచి ఉండకుండా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. భారీ వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు తెలిపారు.












