ప్రజలు ట్రాఫిక్ నియమాలపై అవగాహన పెంచుకోవాలని, రోడ్డు భద్రత చర్యలు పాటించడం ద్వారా ప్రమాదాలను తగ్గించవచ్చని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. సారంగాపూర్ మండలం ధని గ్రామంలో 'ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక' కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన గ్రామసభలో ఆమె ఈ సూచనలు చేశారు.
జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, ఎస్పీ జానకి షర్మిల సోమవారం సారంగాపూర్ మండలం ధని గ్రామంలో 'ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక' కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన గ్రామసభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులకు రోడ్డు భద్రత, ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పించారు.
కలెక్టర్ అభిలాష అభినవ్ మాట్లాడుతూ, రోడ్డు ప్రమాదాలలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారని, ట్రాఫిక్ నియమాలు పాటించడం ద్వారా ఈ ప్రమాదాలను తగ్గించవచ్చని అన్నారు. గ్రామంలో రోడ్డు భద్రత కమిటీ ఏర్పాటును అభినందిస్తూ, ప్రతి ఒక్కరూ నియమాలు పాటించేలా చొరవ చూపాలని కోరారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, మద్యం సేవించి వాహనాలు నడపరాదని సూచించారు.
గ్రామస్తులు బ్రిడ్జి సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకురాగా, సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ఆమె హామీ ఇచ్చారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా గ్రామాల్లో ఇప్పటికే పారిశుధ్యం, ఆరోగ్య శిబిరాలు నిర్వహించినట్లు తెలిపారు.
ఎస్పీ జానకి షర్మిల మాట్లాడుతూ, రోడ్డు భద్రత నియమాలను బాధ్యతగా పాటించాలని, చిన్న జాగ్రత్తలతో ప్రమాదాలను నివారించవచ్చని అన్నారు. హెల్మెట్, లైసెన్స్, వాహన పత్రాలు తప్పనిసరిగా ఉండాలని, సీట్ బెల్ట్ ధరించాలని సూచించారు. మైనర్లకు వాహనాలు ఇవ్వరాదని ఆమె పేర్కొన్నారు.








