భువనేశ్వర్ (మనోరంజని తెలుగు టైమ్స్) ఆగస్టు 19
ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో తమ డిమాండ్ల సాధన కోసం ఆందోళన చేస్తున్న యాప్ ఆధారిత క్యాబ్, బైక్ డ్రైవర్లపై పోలీసులు బుధవారం లాఠీచార్జ్ చేశారు. ఈ క్రమంలో 30 మందికి పైగా డ్రైవర్లను అదుపులోకి తీసుకుని, వారి వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.
ఒడిశాలో తమ డిమాండ్ల సాధన కోసం శాంతియుతంగా నిరసన చేపడుతున్న యాప్ ఆధారిత క్యాబ్, బైక్ డ్రైవర్లపై పోలీసులు బుధవారం లాఠీచార్జ్ చేశారు. ఆందోళనకారులను అదుపులోకి తీసుకుని, వారి వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో 30 మందికి పైగా డ్రైవర్లను అదుపులోకి తీసుకున్నారు.
డిమాండ్ల సాధన కోసం ఆందోళన
ప్రయాణ ఛార్జీల పెంపు, అప్లికేషన్ ఫీజు తగ్గింపు, సామాజిక భద్రతతో సహా తమ ఏడు డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ గత రెండు రోజులుగా క్యాబ్, బైక్ రైడర్లు ఆందోళన చేపడుతున్న విషయం తెలిసిందే. వీరంతా వివిధ ప్రైవేట్ ఆన్లైన్ రైడ్-హెయిలింగ్ ప్లాట్‌ఫారమ్‌లలో నమోదైన క్యాబ్, బైక్ డ్రైవర్లు. తమ సమస్యలను పరిష్కరించాలని, ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కోరుతూ రైడింగ్‌లను నిలిపివేసి గత రెండు రోజులుగా ఆందోళన చేపడుతున్నారు.
ర్యాలీ, రహదారి దిగ్బంధం
ఆందోళనలో భాగంగా బుధవారం ఉదయం భువనేశ్వర్‌లోని రాజ్‌మహల్ స్క్వేర్ వరకు టాక్సీ, బైక్‌లతో ర్యాలీ చేపట్టిన అనంతరం మహాత్మా గాంధీ మార్గ్‌లో రహదారిని దిగ్బంధించారు. మాస్టర్ క్యాంటీన్, రైల్వే స్టేషన్ ప్రాంతాలకు వెళ్లే మార్గంలో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది.
పోలీసుల లాఠీచార్జ్
పోలీసులు వాహనాలను అక్కడి నుండి తొలగించాలని ఆదేశించారు. అయినప్పటికీ డ్రైవర్లు ఆందోళనను కొనసాగిస్తుండటంతో పోలీసులు వారిపై లాఠీచార్జ్ చేశారు.
ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం
డ్రైవర్లు పోలీసులపై రాళ్లు రువ్వారని, పిఎంజి స్క్వేర్‌లో పార్క్ చేసిన పలు ప్రభుత్వ బస్సులను ధ్వంసం చేశారని భువనేశ్వర్ డిజిపి తెలిపారు.
చట్టవిరుద్ధమని పోలీసుల ప్రకటన
ఈ నిరసన చట్టవిరుద్ధమని, కేవలం ఆగస్టు 17న మాత్రమే ఆందోళన చేపట్టేందుకు అనుమతి తీసుకున్నారని, చట్టవిరుద్ధంగా ఆందోళన కొనసాగిస్తున్నారని ఆయన అన్నారు. ఈ యాప్‌లు ప్రైవేట్ సంస్థలకు చెందినవని, వాటితో ప్రభుత్వానికి సంబంధం లేదని ఆయన తెలిపారు.












