తెలంగాణ రాజకీయాల్లో గణనీయమైన మార్పులు చోటుచేసుకోనున్నాయి. కేంద్ర ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ బిల్లుతో పాటుగా నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) అమలుకు సిద్ధమవుతోంది. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ఈ బిల్లుల ఆమోదం దిశగా కసరత్తు జరుగుతున్నట్లు సమాచారం.
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియోజకవర్గాల పెంపును వ్యతిరేకిస్తున్నప్పటికీ, కేంద్రం 2011 జనాభా లెక్కల ప్రకారం పునర్విభజనకు సిద్ధమైంది. దీంతో, కొత్తగా ఏర్పడనున్న లోక్సభ స్థానాలు, వాటి రిజర్వేషన్ల విషయంలో దాదాపు స్పష్టత వచ్చినట్లు తెలుస్తోంది.
కేంద్రం 2029 సార్వత్రిక ఎన్నికల నుంచే మహిళా రిజర్వేషన్లతో పాటుగా నియోజకవర్గాల పునర్విభజనను అమలు చేసేలా ప్రణాళికలు రచిస్తున్నట్లు సమాచారం. ఈ కొత్త నియోజకవర్గాల్లోనే 2029 ఎన్నికలు జరిగేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. మహిళా బిల్లుకు మద్దతు పలుకుతున్నప్పటికీ, కాంగ్రెస్ పార్టీ డీలిమిటేషన్ ప్రక్రియను వ్యతిరేకిస్తోంది.
ప్రస్తుతం తెలంగాణలో ఉన్న 17 లోక్సభ నియోజకవర్గాల సంఖ్య, ప్రతిపాదిత డీలిమిటేషన్ ప్రకారం 26కి చేరనుంది. 2011 జనాభా లెక్కల ప్రకారం నియోజకవర్గాల పెంపు జరగనుండటంతో, కొత్త నియోజకవర్గాలపై స్పష్టత ఏర్పడింది. అత్యధిక జనాభా కలిగిన రంగారెడ్డి ఉమ్మడి జిల్లాలో, ప్రస్తుతం మల్కాజిగిరి, చేవెళ్ల, భువనగిరి, సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గాల పరిధిలో విస్తరించి ఉన్న ప్రాంతాలను విభజించి, కొత్తగా నాలుగు లోక్సభ స్థానాలు ఏర్పాటు చేసే అవకాశం ఉంది. దేశంలోనే అత్యధిక ఓటర్లు ఉన్న మల్కాజిగిరి నియోజకవర్గం రెండు స్థానాలుగా మారే అవకాశం కనిపిస్తోంది.
ఇక, ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలను విభజించి మరో రెండు కొత్త స్థానాలు, ఉమ్మడి మెదక్ జిల్లాలో ఒక స్థానం, మహబూబ్ నగర్ - నాగర్ కర్నూలు జిల్లాలను విభజించి మరో స్థానం, వరంగల్- ఖమ్మం- నల్గొండ జిల్లాల పరిధిలో మరో రెండు స్థానాలు కొత్తగా ఏర్పడే అవకాశం ఉంది. మహిళా రిజర్వేషన్ల బిల్లు ఆమోదం పొందితే, రాష్ట్రానికి 2029 ఎన్నికల నుంచి లోక్సభలో 9 స్థానాలు మహిళలకు కేటాయించబడతాయి. అదేవిధంగా, రాష్ట్ర అసెంబ్లీలోనూ మహిళలకు 55 స్థానాలు కేటాయించాల్సి ఉంటుంది. పార్లమెంట్లో బిల్లు ఆమోదం పొందిన తర్వాత, కేంద్రం డీలిమిటేషన్ కమిటీని ఏర్పాటు చేస్తుంది. ప్రజాభిప్రాయ సేకరణ, నివేదికల ఆధారంగా కొత్త నియోజకవర్గాలపై అధికారిక గెజిట్ విడుదల అవుతుంది. ఈ పరిణామాలతో డీలిమిటేషన్ ప్రక్రియపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.











