సారంగాపూర్ మండలంలోని స్వర్ణ గ్రామంలో విపత్తుల సమయంలో ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జాతీయ విపత్తు స్పందన బృందం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు ప్రజలు పాటించాల్సిన రక్షణ చర్యలను వివరించారు.
వరదలు, భారీ వర్షాలు, అగ్ని ప్రమాదాలు, ఇతర అత్యవసర పరిస్థితుల్లో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం, ప్రాణ నష్టం జరగకుండా అప్రమత్తంగా వ్యవహరించడం, విపత్తుల సమయంలో అధికారులకు సహకరించడం వంటి అంశాలపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు.
ప్రజల భద్రతే ప్రధాన లక్ష్యంగా ఇలాంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అధికారులు తెలిపారు. విపత్తుల సమయంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండి, అధికారుల సూచనలు పాటించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో శిక్షణలో ఉన్న అదనపు కలెక్టర్ రాకేష్, మండల అభివృద్ధి అధికారి లక్ష్మీకాంత రావు, తహసీల్దార్ విజయ్ కాంత్ రావు, గ్రామ సర్పంచ్, గ్రామ కార్యదర్శి తదితర అధికారులు పాల్గొన్నారు.












