నిర్మల్ జిల్లా, సారంగాపూర్: హిందూ ధర్మ రక్షకుడైన ఛత్రపతి శివాజీ మహారాజ్ యువతకు ఆదర్శమని, ఆయన స్ఫూర్తితో ముందుకు సాగాలని ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. గురువారం సారంగాపూర్ మండలం మలక్ చించొలి గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన శివాజీ మహారాజ్ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు.
ఆవిష్కరణ అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ, సనాతన ధర్మ పరిరక్షణకు శివాజీ మహారాజ్ చేసిన సేవలు ఎంతో గొప్పవని, మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించిన ఆయన ధైర్యసాహసాలు నేటి యువతకు స్ఫూర్తిదాయకమని తెలిపారు. ఆయన జీవితం నుండి నేర్చుకోవాల్సింది ఎంతో ఉందని, యువత ఆ దిశగా ప్రయత్నించాలని సూచించారు.
శివాజీ మహారాజ్ కేవలం యోధుడు మాత్రమే కాదని, ఆయన పరిపాలనా దక్షత, ప్రజల పట్ల ఆయనకున్న బాధ్యత కూడా ఆదర్శనీయమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఆయన ఆశయాలను కొనసాగించాల్సిన అవసరం ఉందని, గ్రామాల అభివృద్ధిలో యువత క్రియాశీలకంగా పాల్గొనాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు రావుల రాంనాథ్, ముత్యం రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు సత్యం చంద్రకాంత్, మండల అధ్యక్షులు నరేష్, నాయకులు అంబటి గంగాధర్, మాజీ ఎంపీటీసీ కొరిపెల్లి రాజేశ్వర్ రెడ్డి, మండల బీజేపీ సీనియర్ నాయకులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శివాజీ విగ్రహావిష్కరణ సందర్భంగా గ్రామంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.


