మిర్యాలగూడకు చెందిన శాస్త్ర హైస్కూల్ విద్యార్థులు 'ఈ-అభ్యాస్' 2025-26 విద్యా సంవత్సరానికి గాను నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఒలింపియాడ్ పోటీ పరీక్షల్లో అద్భుత ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి అవార్డులను గెలుచుకున్నారు. మొత్తం 24 మంది విద్యార్థులు ఈ ప్రతిష్టాత్మక పురస్కారాలకు ఎంపికయ్యారు.
హైదరాబాద్లోని భారతీయ విద్యాభవన్ లో జరిగిన 'అభ్యాసోత్సవ అవార్డుల' కార్యక్రమంలో విజేతలకు ఒలింపియాడ్ అవార్డులను అందజేశారు. ఈ కార్యక్రమంలో పద్మశ్రీ అవార్డు గ్రహీత శాంతా సిన్హా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సిఎస్) ఐ.వై.ఆర్. కృష్ణారావు, ప్రముఖ వైద్యులు డాక్టర్ గురువా రెడ్డి వంటి ప్రముఖులు పాల్గొన్నారు.
ముఖ్య అతిథుల చేతుల మీదుగా శాస్త్ర హైస్కూల్ విద్యార్థులు పురస్కారాలను అందుకున్నారు. ఈ విజయం విద్యార్థుల కృషికి, పాఠశాల విద్యా ప్రమాణాలకు అద్దం పట్టింది.
పాఠశాల కరస్పాండెంట్ పాశం శ్రీధర్ రెడ్డి, ప్రిన్సిపల్ పాశం సింధు రెడ్డి విజేతలైన విద్యార్థులను, వారికి మార్గనిర్దేశం చేసిన ఉపాధ్యాయ బృందాన్ని అభినందించారు. నాణ్యమైన విద్యతో పాటు విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికితీయడానికి పాఠశాల ప్రాధాన్యత ఇస్తుందని కరస్పాండెంట్ తెలిపారు.
శాస్త్ర విద్యాసంస్థల చైర్మన్ మైనం చంద్రశేఖర్ విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, భవిష్యత్తులో మరిన్ని జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో రాణించాలని ఆకాంక్షించారు.











